Loading...
WhatsApp PDF: వాట్సప్‌ యూజర్లకు శుభవార్త.. PDF ఎడిట్‌తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్లు
వాట్సప్‌ యూజర్లకు శుభవార్త.. PDF ఎడిట్‌తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్లు

WhatsApp PDF: వాట్సప్‌ యూజర్లకు శుభవార్త.. PDF ఎడిట్‌తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ తన వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. PDF ఫైళ్లను యాప్‌ నుంచే ఎడిట్‌ చేసే అవకాశం,ఐప్యాడ్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగించే సదుపాయం,మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి పాటలను నేరుగా స్టేటస్‌లో షేర్‌ చేసే ఫీచర్‌తో పాటు కార్‌ప్లే,ఆండ్రాయిడ్‌ ఆటో వినియోగదారులకు కూడా కొత్త సౌకర్యాలను మెటా విడుదల చేసింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్లలో PDF ఎడిటింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు వాట్సప్‌లో వచ్చిన PDF డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసి, వేరే యాప్‌లో తెరిచి మార్పులు చేయాల్సి వచ్చేది.

వివరాలు 

థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ల అవసరం లేకుండానే..

ఇటీవల వాట్సప్‌లోనే PDFలను ఓపెన్‌ చేసే సదుపాయాన్ని అందించిన సంస్థ, ఇప్పుడు అడోబ్‌తో భాగస్వామ్యంగా వెబ్‌, డెస్క్‌టాప్‌ వినియోగదారుల కోసం యాప్‌లోనే PDFలను నేరుగా ఎడిట్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీంతో థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ల అవసరం లేకుండానే డాక్యుమెంట్‌లను సవరించుకోవచ్చు.

ఐప్యాడ్‌ వినియోగదారులకు కూడా మెటా కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు వాట్సప్‌ను ఉపయోగించాలంటే స్మార్ట్‌ఫోన్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉంచి, ఐప్యాడ్‌ను కేవలం లింక్‌డ్‌ డివైజ్‌గా మాత్రమే అనుసంధానించాల్సి వచ్చేది.

ఇకపై ఐప్యాడ్‌లోనే నేరుగా వాట్సప్‌లో లాగిన్‌ కావడంతో పాటు, కొత్త అకౌంట్‌ను కూడా సృష్టించుకునే అవకాశం కల్పించింది. దీంతో ఐప్యాడ్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగించుకోవచ్చు.

వివరాలు 

కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వినియోగదారుల కోసం కూడా కొత్త సదుపాయాలు

మ్యూజిక్‌ను ఇష్టపడే వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను కూడా వాట్సప్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఇకపై యాపిల్‌ మ్యూజిక్‌,స్పాటిఫై వంటి ప్రముఖ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌లలో నచ్చిన పాటలను నేరుగా వాట్సప్‌ స్టేటస్‌లో షేర్‌ చేసుకునే వీలు ఉంటుంది.

అంతేకాదు,కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వినియోగదారుల కోసం కూడా కొత్త సదుపాయాలు తీసుకొచ్చింది.

ఈ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండానే కార్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ నుంచే వాట్సప్‌ను వినియోగించవచ్చు.

సందేశాలు పంపడం, కాల్స్‌ చేయడం, కాల్‌ హిస్టరీ చూడడం వంటి పనులను నేరుగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త ఫీచర్లను ఇప్పటికే విడుదల చేసినట్లు మెటా తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది.

అయితే ఇవి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT