WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. త్వరలో పుట్టిన తేదీ నమోదు తప్పనిసరి అవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేసే అవకాశం కల్పించింది. దేశంలో త్వరలో అమల్లోకి రానున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇటీవల కొందరు యూజర్లకు వాట్సాప్‌లో 'మీ పుట్టిన తేదీని నమోదు చేయండి' అనే సందేశం కనిపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం పరిమిత సంఖ్యలోని వినియోగదారులతో పరీక్షిస్తున్నామని వాట్సాప్ అధికారికంగా ధ్రువీకరించింది.
వివరాలు
ఈ వివరాలను ఇతర వినియోగదారులకు చూపబోమని స్పష్టం
అయితే, ప్రస్తుతం పుట్టిన తేదీ నమోదు పూర్తిగా ఐచ్ఛికమేనని కంపెనీ స్పష్టం చేసింది.
వినియోగదారులు తమ వివరాలు నమోదు చేయకపోయినా యాప్‌ను ఇప్పటిలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించవచ్చని తెలిపింది.
ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ వినియోగంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా వివరించింది. వయసుకు సంబంధించిన సమాచారం పూర్తిగా వ్యక్తిగతమని వాట్సాప్ పేర్కొంది.
నమోదు చేసిన పుట్టిన తేదీ లేదా వయసు వివరాలను ఇతర వినియోగదారులకు చూపబోమని స్పష్టం చేసింది.
గోప్యతకు భంగం కలగకుండా వినియోగదారుల వయసును నిర్ధారించే సురక్షిత విధానాలపై ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
వివరాలు
18 ఏళ్లలోపు ఉన్న వినియోగదారులను గుర్తించే విధానం ఉండాలని చట్టం
డీపీడీపీ చట్టం ప్రకారం చిన్నారుల వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే డిజిటల్ వేదికలు వినియోగదారుల వయసును ధ్రువీకరించే వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా 18 ఏళ్లలోపు ఉన్న వినియోగదారులను గుర్తించే విధానం ఉండాలని చట్టం పేర్కొంటోంది.
ఈ నిబంధనలకు అనుగుణంగా వాట్సాప్ బర్త్‌డేట్ నమోదు ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, భారత్‌లో మెటా సేవలపై ఇటీవల ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పెరిగింది.
వివరాలు
మోదీకి మెటా క్షమాపణలు
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్టు తాత్కాలికంగా తొలగించబడిన ఘటనపై మెటా క్షమాపణలు తెలిపింది.
మరోవైపు మొబైల్ నంబర్ అవసరం లేకుండా యూజర్‌నేమ్ ఆధారంగా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఫీచర్‌ను విడుదల చేయవద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వాట్సాప్‌ను కోరినట్లు సమాచారం.
నకిలీ ఖాతాలు పెరగడం, డిజిటల్ మోసాలకు అవకాశం ఉండొచ్చన్న ఆందోళనలే ఈ సూచనలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.