WhatsApp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్.. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షెడ్యూల్ చేసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. నిర్ణయించిన తేదీ, సమయానికి అవి ఆటోమేటిక్‌గా అవతలి వ్యక్తులకు చేరుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులపై వాట్సాప్ పరీక్షిస్తోంది. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 2.26.40.7 వెర్షన్‌లో ఈ సదుపాయాన్ని పరిశీలిస్తున్నారు. ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు నిర్ణీత సమయానికి పంపేలా ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నారు.
వివరాలు
వ్యక్తిగత,గ్రూప్ చాట్స్‌లోనూ..
వాట్సాప్ తీసుకురానున్న మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ వ్యక్తిగత చాట్స్‌కే పరిమితం కాదు.
గ్రూప్ చాట్స్‌లోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకేసారి పలువురికి పంపాల్సిన సందేశాలను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు.
ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా నిర్ణీత సమయానికి మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది.
రానున్న వారాల్లో ఈ ఫీచర్‌ను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది.
వివరాలు
వాట్సాప్‌లో మెసేజ్‌లను ఎలా షెడ్యూల్ చేయాలి?
ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం సులభమే. మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి.
అప్పుడు స్క్రీన్ కింది భాగంలో కనిపించే ఆప్షన్ల నుంచి మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి.
ఆ తర్వాత సెండ్ బటన్‌ను నొక్కితే మెసేజ్ షెడ్యూల్ అవుతుంది.
మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి ఆ సందేశం పంపిస్తారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు, సమావేశాల ఆహ్వానాలు, ఈవెంట్‌ల లింకులు పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
తర్వాత పంపాల్సిన మెసేజ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
వివరాలు
త్వరలో 'షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు' ట్యాబ్..
మెసేజ్‌లను షెడ్యూల్ చేసే సదుపాయంతో పాటు, చాట్స్‌లో ప్రత్యేకంగా 'షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు' (Scheduled Messages) ట్యాబ్‌ను కూడా తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తోంది.
దీని ద్వారా ముందుగా షెడ్యూల్ చేసిన సందేశాలను సులభంగా చూసుకోవచ్చు. అవసరమైతే వాటిని తొలగించుకోవచ్చు.
ఫొటోలు, వీడియోలను ఎంచుకునే గ్యాలరీ ఆప్షన్‌లోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
అక్కడ సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా ఫొటోలు, వీడియోలను కూడా షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.