Loading...
Spinal Cord Transplant: వైద్య రంగంలో కీలక పరిణామం.. పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా,రష్యా వైద్యుల ఘనత..
చైనా,రష్యా వైద్యుల ఘనత..

Spinal Cord Transplant: వైద్య రంగంలో కీలక పరిణామం.. పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా,రష్యా వైద్యుల ఘనత..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా,రష్యా వైద్యులు కలిసి పక్షవాతానికి గురైన ఓ వ్యక్తికి వెన్నుపాము మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు ప్రకటించారు. కణజాలాలను అనుసంధానించే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు చైనా సర్జన్ రెన్ జియావోపింగ్ వెల్లడించారు. ఈ శస్త్రచికిత్స వైద్య రంగంలో కీలక పరిణామమని ఆయన పేర్కొన్నారు. రెన్ జియావోపింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 14, 15 తేదీల మధ్య సుమారు 12 గంటల పాటు వైద్యులు శ్రమించి ఈ ఆపరేషన్ నిర్వహించారు. రష్యాలోని స్క్లిఫోసోవ్స్కీ అత్యవసర వైద్య పరిశోధనా సంస్థలో ఈ శస్త్రచికిత్స జరిగినట్లు ఆయన తెలిపారు. మూడేళ్ల క్రితం వెన్నుపాముకు గాయమై పక్షవాతానికి గురైన రోగికి ఈ చికిత్స అందించారు.

వివరాలు 

ప్రపంచంలోనే మొట్టమొదటి వెన్నుపాము మార్పిడి శస్త్రచికిత్స

దెబ్బతిన్న వెన్నుపాము భాగాన్ని తొలగించి, బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన కణజాలాన్ని దాని స్థానంలో అమర్చినట్లు వివరించారు.

ఈ ప్రక్రియలో మైక్రోసర్జరీ పద్ధతులతో పాటు కణాల త్వచాలను అనుసంధానించేందుకు పాలిథిలిన్ గ్లైకాల్ అనే రసాయన పదార్థాన్ని ఉపయోగించారు.

ఈ విధానంతో వెన్నుపాము మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు రెన్ వెల్లడించారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి వెన్నుపాము మార్పిడి శస్త్రచికిత్సగా ఆయన దీనిని అభివర్ణించారు.

చైనాలోని గ్వాంగ్జీ యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ మెడిసిన్‌కు అనుబంధంగా ఉన్న సెకండ్ అఫిలియేటెడ్ హాస్పిటల్‌కు చెందిన తన బృందం, రష్యా వైద్య నిపుణుల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు రెన్ తెలిపారు.

శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

భవిష్యత్తులో తల మార్పిడి ప్రయోగాలు

ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ తల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహిస్తానని రెన్ గతంలో ప్రకటించారు.

తాజాగా వెన్నుపాము మార్పిడి శస్త్రచికిత్స చేపట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో తల మార్పిడి ప్రయోగాలు కూడా చేపట్టే అవకాశం ఉందని కొందరు వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ తరహా ప్రయోగాల వైద్యపరమైన ఫలితాలు, దీర్ఘకాలిక ప్రభావాలపై మరింత పరిశీలన అవసరం.

ADVERTISEMENT