UN warns: భూతాపం 1.5 డిగ్రీలు దాటడం ఖాయం.. హెచ్చరించిన ఐరాస
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు స్థాయులతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు పెట్టుకున్నాయి. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇక సాధ్యం కాకపోవచ్చని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచం 1.5 డిగ్రీల పరిమితిని దాటే దిశగా వెళ్తోందని పేర్కొంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కొత్త వ్యూహాన్ని కూడా ఈ నివేదికలో సూచించింది. ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట స్థాయికి చేరకుండా చూడటంతో పాటు.. ఆ పరిమితిని దాటిన తర్వాత పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురావాలన్న దానిపై దృష్టి పెట్టాలని సూచించింది.
వివరాలు
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పటికే 1.4 డిగ్రీలు పెరిగింది
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పటికే సుమారు 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని ఐరాస నివేదిక తెలిపింది.
చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుతున్నాయి.
ఈ వాయువులు భూమి నుంచి వెలువడే వేడిని వాతావరణంలోనే నిలుపుతూ భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయి.
దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. తీవ్రమైన వేడి గాలులు, కరువులు, వరదలు, అడవి మంటలు వంటి విపత్తులు పెరుగుతున్నాయి.
ఇవి మనుషులతో పాటు జీవవైవిధ్యానికి కూడా ముప్పుగా మారుతున్నాయని నివేదిక పేర్కొంది.
వివరాలు
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే మార్గాలు
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో తొలగించాల్సి ఉంటుందని ఐరాస నివేదిక సూచించింది.
ఇందుకోసం ప్రపంచంలోని విస్తారమైన ప్రాంతాల్లో అడవులను పెంచడం ఒక మార్గమని తెలిపింది.
అలాగే గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను నేరుగా తొలగించే ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సి రావచ్చని పేర్కొంది.
అయితే ఇలాంటి చర్యలు చేపట్టినా సమీప భవిష్యత్తులో ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని నివేదిక తెలిపింది.
ప్రస్తుత స్థాయికి ఉష్ణోగ్రతలు తిరిగి రావడానికి కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాలు కూడా పట్టవచ్చని హెచ్చరించింది.