X: ఫ్రీ యూజర్లకు రోజుకు 50 పోస్టుల పరిమితి.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన X
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X మరో కొత్త పరిమితిని తీసుకొచ్చింది. వెరిఫికేషన్ లేని అకౌంట్లపై పోస్టింగ్ లిమిట్స్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పును పలువురు యూజర్లు Xతో పాటు రెడిట్‌లో కూడా షేర్ చేశారు. X హెల్ప్ సెంటర్‌లో అప్‌డేట్ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై అన్‌వెరిఫైడ్ అకౌంట్లు రోజుకు గరిష్టంగా 50 ఒరిజినల్ పోస్టులు, 200 రిప్లైలు మాత్రమే చేయగలవు. గతంలో ఈ అకౌంట్లకు రోజుకు 2,400 పోస్టుల వరకు అవకాశం ఉండేది. ఇప్పుడు భారీగా పరిమితులు తగ్గించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
స్పామ్ పోస్టులు, బాట్ అకౌంట్ల కార్యకలాపాలను తగ్గించడానికే X నిర్ణయం
ఈ కొత్త నిబంధనలపై కొంతమంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా పరిమితులు పెడితే ప్లాట్‌ఫామ్‌ను వదిలి వెళ్లే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే స్పామ్ పోస్టులు, బాట్ అకౌంట్ల కార్యకలాపాలను తగ్గించడానికే X ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎక్కువగా పోస్టులు చేయాలనుకునే వారికి X ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇందులో బేసిక్ ప్లాన్ నెలకు 3 డాలర్లు లేదా ఏడాదికి 32 డాలర్ల ధరతో అందుబాటులో ఉంది. ఎక్కువగా పోస్టులు చేసే యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది.