Grok: గ్రోక్ భద్రతపై ప్రశ్నించిన ఇంజినీర్‌కు షాక్.. xAIపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ(AI)సంస్థ xAI,దాని అనుబంధ సంస్థ స్పేస్-X పై మాజీ ఉద్యోగి దేవిన్ కిమ్ కోర్టును ఆశ్రయించారు. 2025 అక్టోబర్ వరకు xAIలో ఇంజినీర్‌గా పనిచేసిన కిమ్ ప్రస్తుతం సెంటర్ ఫర్ AI సేఫ్టీ అనే లాభాపేక్షలేని సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రోక్(Grok)ఏఐ చాట్‌బాట్ భద్రతపై తాను వ్యక్తం చేసిన ఆందోళనల కారణంగానే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టులో దాఖలైన పిటిషన్‌లో,గ్రోక్ అభివృద్ధి సమయంలో AI భద్రతా ప్రమాణాలను xAI నిర్లక్ష్యం చేసిందని దేవిన్ కిమ్ పేర్కొన్నారు. దీంతో చాట్‌బాట్ వివక్షను ప్రోత్సహించేలా,హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసేలా,సామూహిక విధ్వంసక ఆయుధాలకు సంబంధించిన వివరాలను కూడా అందించే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు.
వివరాలు
తనను ఒక 'విసిల్‌బ్లోయర్'గా పేర్కొన్న దేవిన్ కిమ్
గ్రోక్ ఒక సందర్భంలో తనను తాను హిట్లర్‌తో పోల్చుకుంటూ 'మెకాహిట్లర్'గా పేర్కొన్న ఘటన తర్వాత, దాని రాజకీయ పక్షపాతం, వివక్షపూరిత ధోరణులపై సమగ్రంగా పరిశీలించాలని తాను ప్రయత్నించినట్లు కిమ్ తన పిటిషన్‌లో వెల్లడించారు. ఈ కేసులో దేవిన్ కిమ్ తనను ఒక 'విసిల్‌బ్లోయర్'గా పేర్కొన్నారు. AI భద్రత విషయంలో xAI వ్యవహరిస్తున్న తీరు ఇంటర్నెట్ నియంత్రణ, వినియోగదారుల రక్షణ, అన్యాయ వ్యాపార విధానాలు, ఆయుధాలు,పేలుడు పదార్థాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించే అవకాశముందని ఆయన ఆరోపించారు. గ్రోక్ అభివృద్ధిలో మరిన్ని భద్రతా చర్యలు తీసుకురావాలని సూచించినందుకే కంపెనీ యాజమాన్యం తనను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు.
వివరాలు
చట్ట ప్రకారం జరగాల్సిన కొన్ని పరీక్షలను తప్పించుకునే ప్రయత్నం
అలాగే, xAI సహ వ్యవస్థాపకుడు జిమ్మీ బా ఎలాన్ మస్క్ సూచనలను పట్టించుకోలేదని, భద్రతా చర్యలను బలోపేతం చేయాలని కోరిన తనపై ప్రతీకార చర్యలకు దిగారని కిమ్ ఆరోపించారు. AI భద్రతా చర్యలను జిమ్మీ బా తీవ్రంగా వ్యతిరేకించారని, "ఎలాగైనా AI మనందరినీ చంపేస్తుంది" అనే వ్యాఖ్యలు కూడా చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రోక్ కోడ్-1 విడుదల సందర్భంగా యూరోపియన్ యూనియన్ భద్రతా నిబంధనలను తప్పించుకునేందుకు మోడల్‌కు సంబంధించిన కొన్ని అంశాలను తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందని కూడా కిమ్ ఆరోపించారు. దీంతో చట్ట ప్రకారం జరగాల్సిన కొన్ని పరీక్షలను తప్పించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.
వివరాలు
కాలిఫోర్నియా కోర్టులో కేసు దాఖలు
2025 సెప్టెంబర్ 15వ తేదీ వారంలో తాను సేకరించిన వివరాలను సంస్థ ముందు ఉంచాలని భావించానని, అయితే అంతకుముందే జరిగిన సమావేశంలో జిమ్మీ బా తమ మార్గాలు వేరుగా చేసుకుందామని చెప్పారని కిమ్ వెల్లడించారు. అనంతరం xAI, స్పేస్‌ఎక్స్ సంస్థలపై ఆయన కాలిఫోర్నియా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో తనకు జరిగిన నష్టానికి పరిహారం, శిక్షాత్మక నష్టపరిహారం చెల్లించడంతో పాటు xAI, స్పేస్‌ఎక్స్ సంస్థల చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించాలని దేవిన్ కిమ్ కోరుతున్నారు.