LOADING...
Phone without the Internet: నెట్‌ లేకుండానే ఫోన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్.. D2M టెక్నాలజీతో నయా విప్లవం
D2M టెక్నాలజీతో నయా విప్లవం

Phone without the Internet: నెట్‌ లేకుండానే ఫోన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్.. D2M టెక్నాలజీతో నయా విప్లవం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్‌లో సినిమాలు,టీవీ షోలు,లైవ్ స్పోర్ట్స్ చూడటం సాధ్యం కానుంది. తాజాగా 'డైరెక్ట్ టూ మొబైల్ (D2M)'అనే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ డేటా లేదా వై-ఫై అవసరం లేకుండానే శాటిలైట్‌,బ్రాడ్‌కాస్ట్ టవర్స్ నుంచి నేరుగా మీ ఫోన్‌కు లైవ్ కంటెంట్ స్ట్రీమ్ అవుతుంది. రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ధర ఉన్న సాధారణ ఫీచర్ ఫోన్లలో కూడా ఇది పనిచేయనుంది. ప్రస్తుతం ఇండియాలో ఇలాంటి ఫోన్లు వాడుతున్నవారు సుమారు 20కోట్ల మంది ఉన్నారు. ఈ విధానంతో నెట్‌వర్క్ లేని లేదా సరిగ్గా కనెక్టివిటీ లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా టీవీ కార్యక్రమాలు,సినిమాలు,స్పోర్ట్స్ లైవ్ మ్యాచులు ఎలాంటి ఆటంకం లేకుండా చూడగలుగుతారు.

వివరాలు 

ఎమర్జెన్సీ అలర్ట్స్, ప్రభుత్వ ప్రకటనలు నేరుగా ప్రజలకు చేరే అవకాశం

లావా, హెచ్‌ఎండీ వంటి కంపెనీలు రూ.2,000-2,500 రేంజ్‌లో ఈ టెక్నాలజీ ఉన్న ఫోన్లు డెవలప్ చేస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన శాంఖ్య ల్యాబ్స్ తయారు చేసిన SL-3000 చిప్‌సెట్ ఈ ఫోన్లలో వాడుతున్నారు. మొదట ప్రసార భారతి కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో ట్రయల్స్ పూర్తయ్యాయి. వచ్చే 6-9 నెలల్లో రెండు డజన్లకు పైగా నగరాల్లో పరీక్షలు జరిపి దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది లక్ష్యం. ఎమర్జెన్సీ అలర్ట్స్, ప్రభుత్వ ప్రకటనలు కూడా ఈ విధానం ద్వారా నేరుగా ప్రజలకు చేరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.8,000 కోట్ల ఖర్చవుతుందని అంచనా.

వివరాలు 

 ఇంటర్నెట్ ఖర్చు లేకుండానే వినోదం అందుబాటులోకి.. 

అయితే డేటా ప్యాక్‌లతో లాభాలు పొందుతున్న టెలికాం కంపెనీలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ప్రాజెక్ట్‌కు అండగా ఉన్న సంస్థలు ధైర్యంగా ముందుకెళ్తున్నాయి. టేజాస్ నెట్‌వర్క్స్‌ ఉపాధ్యక్షుడు పరాగ్ నాయక్ మాట్లాడుతూ,భారత్‌లో తయారైన చిప్ తొలిసారి ఫోన్‌లలో వాడటం గర్వకారణం అన్నారు. ఈ టెక్నాలజీతో 20 కోట్ల మందికి పైగా ఫీచర్ ఫోన్ యూజర్లకు ఇంటర్నెట్ ఖర్చు లేకుండానే వినోదం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఐఐటీ కాన్పూర్ కూడా D2Mపై పరిశోధన చేసి ఇది మిగతా బ్రాడ్‌కాస్టింగ్ రంగానికి పెద్ద మార్పు తీసుకొస్తుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న చాలా ఫోన్లలో దీనికి అవసరమైన హార్డ్‌వేర్ మద్దతు లేకపోవడంతో కొత్త మోడళ్ల తయారీకి పెద్ద పెట్టుబడి అవసరమని కూడా స్పష్టం చేసింది.

Advertisement