Loading...
YouTube: యూట్యూబ్‌లో కస్టమ్ ఫీడ్స్ ఫీచర్.. ఇక మీకు నచ్చిన వీడియోలే!
యూట్యూబ్‌లో కస్టమ్ ఫీడ్స్ ఫీచర్.. ఇక మీకు నచ్చిన వీడియోలే!

YouTube: యూట్యూబ్‌లో కస్టమ్ ఫీడ్స్ ఫీచర్.. ఇక మీకు నచ్చిన వీడియోలే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యూట్యూబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారు. యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా హోమ్‌పేజీని తమ అభిరుచులకు అనుగుణంగా మార్చుకునేలా 'కస్టమ్ ఫీడ్స్' (Custom Feeds) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న పాత టాపిక్ చిప్స్ స్థానంలో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు మొబైల్ యాప్ నావిగేషన్‌లోనూ కొన్ని మార్పులు చేస్తోంది.

వివరాలు 

నచ్చిన వీడియోలతో ప్రత్యేక ఫీడ్

తాజా అప్‌డేట్‌తో యూట్యూబ్ హోమ్‌పేజీలో కనిపించే వీడియోలను యూజర్లు తమ అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.

ఇందుకోసం హోమ్‌పేజీ పైన కనిపించే '+' బటన్‌ను ట్యాప్ చేసి, తమకు కావాల్సిన టాపిక్, కంటెంట్ లేదా వీడియోలకు సంబంధించిన వివరాలను టైప్ చేయాలి.

యూట్యూబ్ మ్యూజిక్‌లో ప్లేలిస్ట్‌ను రూపొందించినట్లుగానే, యూజర్లు ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా యూట్యూబ్ ప్రత్యేకమైన వీడియో ఫీడ్‌ను సిద్ధం చేస్తుంది.

ఆయా అంశాలకు సంబంధించిన కొత్త వీడియోలు అప్‌లోడ్ అయినప్పుడల్లా ఈ ఫీడ్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.

దీంతో యూజర్లు తమకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను సులభంగా చూడొచ్చు.

వివరాలు 

ఉచిత యూజర్లకు 3.. ప్రీమియం సభ్యులకు 8 ఫీడ్స్

కస్టమ్ ఫీడ్స్ ఫీచర్‌లో భాగంగా ఉచిత యూజర్లు ఒకేసారి గరిష్ఠంగా మూడు ఫీడ్స్‌ను సేవ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మాత్రం ఎనిమిది వరకు ఫీడ్స్‌ను సేవ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌పై యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

కొత్త అప్‌డేట్‌తో యూజర్లు తమ హోమ్‌పేజీపై మరింత నియంత్రణ పొందుతారని వెల్లడించారు.

'కస్టమ్ ఫీడ్స్‌తో మీ హోమ్‌పేజీపై పూర్తి నియంత్రణను మీకే అందిస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

మొబైల్ యాప్ నావిగేషన్‌లోనూ మార్పులు

కస్టమ్ ఫీడ్స్‌తో పాటు యూట్యూబ్ తన మొబైల్ యాప్ డిజైన్‌లోనూ స్వల్ప మార్పులు చేస్తోంది.

ఇందులో భాగంగా హోమ్ ట్యాబ్‌లో కొత్త టాప్ బార్‌ను పరీక్షిస్తోంది. ఈ నావిగేషన్ బార్‌లో 'సబ్‌స్క్రిప్షన్స్' ఫీడ్‌ను చేర్చింది.

వీటితో పాటు లైవ్, మ్యూజిక్ షార్ట్‌కట్స్‌ను కూడా అందిస్తోంది.

సబ్‌స్క్రైబర్ల కోసం 'మూవీస్ అండ్ టీవీ' ఆప్షన్‌ను సైతం ఈ టాప్ బార్‌లోనే చూపించనుంది.

దీంతో యూజర్లు తమకు అవసరమైన విభాగాలను మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రస్తుతం అమెరికా యూజర్లకే అందుబాటులో..

ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ను అమెరికాలో 13 ఏళ్లు పైబడిన, ఇంగ్లీష్ భాషను ఎంచుకున్న యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ ఫీచర్ పనిచేయాలంటే యూజర్ల వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ ఆన్‌లో ఉండాలి.

మొబైల్ యాప్‌లో రూపొందించిన కస్టమ్ ఫీడ్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లోనూ సింక్ అవుతాయి.

ప్రస్తుతం పరిమితంగా అందుబాటులోకి వస్తున్న ఈ అప్‌డేట్‌ను త్వరలో మరింత మంది యూజర్లకు విస్తరించనుంది.

ADVERTISEMENT