YouTube: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. కోట్లాది యూజర్లకు ఇబ్బందులు
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా బుధవారం(ఫిబ్రవరి 18, 2026) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కోట్లాది మంది వినియోగదారులు వీడియోలు చూడలేక ఇబ్బందిపడ్డారు. మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్ కూడా సరిగా పనిచేయకపోవడంతో యూజర్లలో అసహనం వ్యక్తమైంది. వినోదం, చదువు, లైవ్ స్ట్రీమింగ్ కోసం యూట్యూబ్‌పై ఆధారపడే వారు ఎక్కువగా ఉండటంతో, సోషల్ మీడియాలో 'యూట్యూబ్ డౌన్ అయిందా?' అంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. అమెరికాలో ముందుగా ఈ సమస్య బయటపడగా, అక్కడే లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం అమెరికాలోనే రెండున్నర లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. యాప్‌లో వీడియోలు కనిపించకపోవడం, వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడం, అకౌంట్‌లో లాగిన్ సమస్యలు రావడం వంటి ఇబ్బందులు తలెత్తాయి.
వివరాలు
రికమండేషన్ సిస్టమ్‌లో తలెత్తిన లోపం.. స్పందించిన గూగుల్
యూట్యూబ్ టీవీ వినియోగదారులు కూడా తమ ఇష్టమైన ఛానెల్స్, పాటలు చూడలేకపోయారు. ఈ సమస్యపై గూగుల్ స్పందిస్తూ, యూట్యూబ్‌లోని రికమండేషన్ సిస్టమ్‌లో తలెత్తిన లోపం కారణంగా హోమ్‌పేజీతో పాటు యూట్యూబ్ యాప్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్‌లో వీడియోలు కనిపించలేదని తెలిపింది. హోమ్‌పేజీని తక్షణమే పునరుద్ధరించామని, పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామని స్పష్టం చేసింది. భారత్‌లో కూడా ఈ అంతరాయం ప్రభావం చూపగా, 18 వేల మందికి పైగా యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ పోస్టులు హల్‌చల్ చేశాయి. యూట్యూబ్, గూగుల్ టీమ్స్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు పనిచేస్తున్నాయని, క్రమంగా వీడియో స్ట్రీమింగ్ కూడా సాధారణ స్థితికి వస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.