Loading...
Fatima Sana: 47 పరుగులు, 4 వికెట్లు.. అయినా ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన ఫాతిమా
47 పరుగులు, 4 వికెట్లు.. అయినా ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన ఫాతిమా

Fatima Sana: 47 పరుగులు, 4 వికెట్లు.. అయినా ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన ఫాతిమా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ఆసియా కప్‌ 2026 సెమీఫైనల్‌ పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఎంతో బాధాకరంగా మారింది. జట్టును ఫైనల్‌కు చేర్చేందుకు బ్యాట్, బాల్‌తో ఆమె తన సర్వశక్తులూ ఒడ్డింది. అయితే ఆమె ఒంటరి పోరాటం చివరికి ఫలించలేదు. సెప్టెంబర్ 11 (శుక్రవారం) దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయింది. మైదానంలోనే బోరున విలపించింది. దీంతో ఆమె సహచరులు ఫాతిమాను ఓదార్చారు.

వివరాలు

బ్యాటింగ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 130/6 స్కోరు సాధించింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాక్ ఒత్తిడిలో పడింది.

అలాంటి సమయంలో కెప్టెన్ ఫాతిమా సనా బాధ్యత తీసుకుంది. ఫాతిమా 36 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేసింది.

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వేడికి ఆమె క్రాంప్స్ సమస్యను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు.

చివరి వరకు క్రీజులో నిలిచిన ఫాతిమా.. టూబా హసన్‌తో కలిసి చివరి నాలుగు ఓవర్లలో వేగంగా పరుగులు జోడించి పాకిస్తాన్ స్కోరును 130 పరుగులకు చేర్చింది.

వివరాలు

బౌలింగ్‌లోనూ సత్తా

130పరుగుల స్కోరును కాపాడుకునేందుకు పాకిస్తాన్ బౌలింగ్‌కు దిగినప్పుడు కూడా ఫాతిమా సనా మరోసారి మెరిసింది.

తన తొలి ఓవర్‌లోనే వరుసగా శ్రీలంక కెప్టెన్ చమారి అటపట్టు, సంజన కవింది వికెట్లను తీసి ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. ఒక దశలో శ్రీలంక 33 పరుగులకే 4వికెట్లు కోల్పోయింది.

దీంతో మ్యాచ్ పాకిస్తాన్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది. అయితే హర్షిత సమరవిక్రమ 36 పరుగులు, కవిషా దిల్హారి 33 పరుగులు చేసి 67 పరుగుల కీలక భాగస్వామ్యంతో మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పారు.

ఫాతిమా మరోసారి బౌలింగ్‌కు వచ్చి తన మూడో ఓవర్‌లోనే ఇద్దరినీ పెవిలియన్‌కు పంపింది.

తొలుత హర్షితను, ఆ తర్వాత కవిషాను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసి మ్యాచ్‌లో తన నాలుగో వికెట్‌ను సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఫాతిమా

అయితే ఆ తర్వాత కౌషాని నుత్యాంగన అజేయంగా 10 పరుగులు, నీలాక్షిక సిల్వా అజేయంగా 18 పరుగులతో బాధ్యత తీసుకున్నారు.

నుత్యాంగన ఫాతిమా బౌలింగ్‌లోనే తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సిక్స్‌ బాదింది. అనంతరం సిల్వా ఫోర్ కొట్టడంతో శ్రీలంక విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ఫాతిమా సనా అజేయంగా 47 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు కూడా తీసింది. దీంతో ఆమెను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపిక చేశారు.

అయితే ఈ వ్యక్తిగత గౌరవం కూడా జట్టు ఓటమి బాధను ఆమె నుంచి దూరం చేయలేకపోయింది. మ్యాచ్ అనంతరం ఫాతిమా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు కనిపించాయి.

ADVERTISEMENT

వివరాలు

'బ్యాటర్లు అద్భుతంగా ఆడారు'.. చమారి అటపట్టు

పాకిస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చాలన్న ఆమె ప్రయత్నం, ఒంటరి పోరాటం జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది.

మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ చమారి అటపట్టు మాట్లాడుతూ.. బౌలింగ్ యూనిట్‌గా తమ జట్టు బాగా ఆడిందని తెలిపారు.

కొన్ని క్యాచ్‌లు వదిలేసినప్పటికీ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని చెప్పారు. హర్షిత, కవిషా ఒత్తిడిని తట్టుకుని సింగిల్స్‌ను బాగా సాధించారని పేర్కొన్నారు.

విష్మి, ఇమేషా, కవిషా వంటి మ్యాచ్ విన్నర్లు తమ జట్టులో ఉన్నారని తెలిపారు. ఫైనల్‌లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడించవచ్చని చమారి అటపట్టు అన్నారు.

వివరాలు

'ఫీల్డింగ్‌లో తప్పులు నష్టం కలిగించాయి'.. ఫాతిమా

పాకిస్తాన్ కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. హర్షిత, కవిషా బాగా ఆడారని, వాళ్లు మ్యాచ్‌ను తమ జట్టు నుంచి దూరం చేశారని పేర్కొన్నారు.

ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులు జరిగాయని, అవి తమ జట్టుకు నష్టం కలిగించాయని తెలిపారు.

డిఫెండ్ చేయగల స్కోరు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఫాతిమా సనా అన్నారు.

ADVERTISEMENT