Box Cricket Tournament: బాక్స్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. ఎస్ఎంఈల ఐక్యతతో గిన్నిస్ ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో, పుణేకు చెందిన ఒక సంస్థ క్రీడా రంగంలో అరుదైన ఘనత సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) రికార్డును దక్కించుకుంది. ఈ విజయంతో పుణే నగరం అంతర్జాతీయ క్రీడా పటంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
వివరాలు
చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఈ మెగా ఈవెంట్ నిర్వహణ
పూణేలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రిసాలిస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫోరమ్ ఈ విశేష రికార్డును నెలకొల్పింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ భారీ స్థాయి బాక్స్ క్రికెట్ పోటీలను నిర్వహించింది. బాక్స్ క్రికెట్ విభాగంలో ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటివరకు ఎలాంటి రికార్డు నమోదు కాకపోవడంతో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records)ఈ కేటగిరీకి ప్రత్యేక విభాగాన్ని సృష్టించడం విశేషంగా నిలిచింది. ఈ నెల 3వ తేదీన పుణెలోని బావ్‌ధాన్ ప్రాంతంలో 'క్రిసాలిస్ ఎస్ఎంఈ లీగ్' పేరిట ఈ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 13 రోజుల పాటు కొనసాగిన ఈ క్రీడా వేడుకల్లో మొత్తం 66 జట్లు పోటీపడ్డాయి.
వివరాలు
30కి పైగా రంగాల నుంచి 75కుపైగా సంస్థలు
సుమారు 726 మంది ఉద్యోగులు 135 మ్యాచ్‌ల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. పుణే, ముంబై నగరాలకు చెందిన 30కి పైగా రంగాల నుంచి 75కుపైగా సంస్థలు ఈ టోర్నీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records)అధికార ప్రతినిధి (అడ్జుడికేటర్) ప్రవీణ్ పటేల్ అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించి ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించారు. టోర్నీకి కనీసం 500 మంది పాల్గొనాల్సిన నిబంధన ఉండగా,ఆ సంఖ్యను సులభంగా దాటినట్లు ఆయన వెల్లడించారు. ఫోరమ్ ఛైర్మన్ మనీష్ గుప్తాతో పాటు ఇతర సీనియర్ ప్రతినిధులు రికార్డు సర్టిఫికేట్‌ను స్వీకరించారు.
వివరాలు
2014లో స్కైడైవింగ్ విభాగంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచడం, క్రీడల ద్వారా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడం, అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో ఎస్ఎంఈల ప్రాధాన్యతను తెలియజేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలుగా నిర్వాహకులు పేర్కొన్నారు. క్రిసాలిస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫోరమ్‌కు ఇది మూడో రికార్డు కావడం విశేషం. 2014లో స్కైడైవింగ్ విభాగంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్(Limca Book of Records)లో స్థానం సంపాదించింది. అలాగే స్కూబా డైవింగ్ విభాగంలోనూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records) రికార్డును సొంతం చేసుకుంది. అయితే భూమిపై సాధించిన తొలి గిన్నిస్ టైటిల్ ఇదే కావడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన అంశం.
వివరాలు
బాక్స్ క్రికెట్ అంటే ఏమిటి?
బాక్స్ క్రికెట్ అనేది సంప్రదాయ క్రికెట్‌కు ఆధునిక రూపం. పరిమిత స్థలంలో, నాలుగు వైపులా వలలతో కప్పబడిన ప్రదేశంలో ఈ ఆటను నిర్వహిస్తారు. ఆ ప్రదేశాన్నే 'బాక్స్' అని పిలుస్తారు. బంతి బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఎప్పుడూ ఆటలోనే ఉండటం దీని ప్రత్యేకత. నగర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇండోర్ కోర్టులు లేదా ఆర్టిఫిషియల్ టర్ఫ్ మైదానాల్లో ఈ ఆట విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది.