SRH vs LSG: ఉప్పల్ వేదికగా కీలక సమరం.. ఇవాళ సన్‌రైజర్స్, లక్నో మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో మరో హైస్కోరింగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నేడు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఈ ఆసక్తికర పోరు జరగనుంది. ఇరు జట్లలోనూ హిట్టర్ల కొరత లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్‌లో పదో మ్యాచ్‌గా జరుగుతున్న ఈ పోరు, డబుల్ హెడర్‌లో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. సొంత మైదానంలో ఆడుతుండటం సన్‌రైజర్స్‌కు ప్లస్ కాగా, గత రికార్డులు మాత్రం లక్నోకు అనుకూలంగా ఉన్నాయి.
వివరాలు
లక్నోదే పైచేయి
గత గణాంకాలను పరిశీలిస్తే, సన్‌రైజర్స్‌పై లక్నో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆరు సార్లు తలపడగా, అందులో నాలుగు మ్యాచ్‌లలో లక్నో విజయం సాధించింది. సన్‌రైజర్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. గతేడాది ఇదే ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో అద్భుత ప్రదర్శన చేసింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది. ఈ రికార్డు లక్నోకు అదనపు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.
వివరాలు
జట్లలో మార్పులు ఇలా
సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బగా కెప్టెన్ పాట్ కమిన్స ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు గైర్హాజరైన కమిన్స్, మూడో మ్యాచ్‌కూ అందుబాటులో ఉండకపోవచ్చు. బౌలింగ్ విభాగంలో డేవిడ్ పైన్ స్థానంలో బ్రైడన్ కార్స్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఎలాంటి మార్పులు చేయకుండా అదే జట్టుతో బరిలోకి దిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతుండగా, హెడ్ టు హెడ్ రికార్డులతో లక్నో ధీమాగా ఉంది. బ్యాటర్ల మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
వివరాలు
ఇరు జట్లలోనే ప్లేయర్స్ వీరే
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు(అంచనా) మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మొహమ్మద్ షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా) అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ.