Vaibhav Suryavanshi: ఐపీఎల్ ప్రదర్శనకు అదిరిపోయే రివార్డ్.. రెండో కారును సొంతం చేసుకున్న వైభవ్!
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి మరో ఖరీదైన బహుమతి లభించింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డు అందుకున్న అతడికి ప్రకటించిన టాటా సియెర్రా ఎస్‌యూవీ ఎట్టకేలకు చేతికి అందింది. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాలు
కుటుంబంతో కలిసి షోరూమ్‌కు వెళ్లిన వైభవ్
ఇటీవల వైభవ్ తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి టాటా షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ పసుపు రంగులో ఉన్న సరికొత్త టాటా సియెర్రా కారును అందుకున్నాడు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కారు ముందు ఫొటోలకు పోజులిచ్చాడు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు అతడికి అభినందనలు తెలుపుతున్నారు.
వివరాలు
ఐపీఎల్ 2026లో పరుగుల వరద
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 776 పరుగులు సాధించాడు.
ఇందులో ఐదు అర్ధశతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. బౌలర్లపై విరుచుకుపడుతూ 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడంతో పాటు 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును కూడా అందుకున్నాడు.
ఈ అవార్డులో భాగంగానే అతడికి టాటా సియెర్రా ఎస్‌యూవీని బహుమతిగా ప్రకటించారు.
వివరాలు
ఇప్పటికే మరో ఖరీదైన కారు సొంతం
వైభవ్‌కు కారు బహుమతులు అందడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ 2025లోనూ 'సూపర్ స్ట్రైకర్' అవార్డును గెలుచుకోవడంతో టాటా కర్వ్ ఈవీని బహుమతిగా అందుకున్నారు.
తాజాగా మరో ఎస్‌యూవీ అతడి కార్ల జాబితాలో చేరింది. దీంతో చిన్న వయసులోనే రెండు ఖరీదైన కార్లను సొంతం చేసుకున్నాడు.
వివరాలు
భారత జట్టులోనూ చోటు.. బిహార్ కెప్టెన్‌గా బాధ్యతలు
2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వైభవ్.. తన వరుస ప్రదర్శనలతో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు.
ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 10 టీ20 మ్యాచ్‌ల్లో 295 పరుగులు సాధించాడు.
ఇటీవల సీనియర్ బిహార్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును నడిపించనున్నాడు.
ఇలా కేవలం 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్‌లో రికార్డులు సృష్టిస్తూ, కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతూ వైభవ్ దూసుకెళ్తున్నాడు.