Team India Schedule 2026 to 2027: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. 9 నెలల పాటు ఫుల్ బిజీగా టీమిండియా షెడ్యూల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా ముగిసిన వెంటనే, భారత క్రికెట్ జట్టు మరో భారీ అంతర్జాతీయ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. కొత్త లక్ష్యాలు, కొత్త సవాళ్లతో టీమిండియాకు రాబోయే ఏడాది అత్యంత కీలకంగా మారనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకుని భారత జట్టు ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆడబోయే పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాలు
టార్గెట్ @ 2027 వన్డే ప్రపంచకప్
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 హడావుడి నుంచి ఆటగాళ్లు పూర్తిగా కోలుకోకముందే అంతర్జాతీయ క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. కేవలం వారం రోజుల్లోనే భారత జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతోంది. ఈసారి ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా కప్, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు టీం ఇండియాను ఎదురుచూస్తున్నాయి.
వివరాలు
సొంతగడ్డపై అఫ్ఘానిస్తాన్ సిరీస్‌తో ఆరంభం
భారత జట్టు తన అంతర్జాతీయ సీజన్‌ను అఫ్ఘానిస్తాన్‌తో ప్రారంభించనుంది. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు సొంతగడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ సిరీస్ అనంతరం జూన్ చివరి వారంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత్, అక్కడ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి జూలై 19 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు మరియు మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌లో తలపడనుంది. అనంతరం ఆగస్టులో శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
వివరాలు
బిజీ బిజీ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల టీం ఇండియాకు మరింత సవాలుగా మారనుంది. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం యూఏఈ వేదికగా అఫ్ఘానిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడుతుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు టీ20 ఫార్మాట్‌లో పాల్గొననుంది.
వివరాలు
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సహా కీలక సిరీస్‌లు
అక్టోబర్‌లో వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అదేసమయంలో అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్-జనవరి కాలంలో శ్రీలంక జట్టు భారత్‌కు పర్యటిస్తుంది. అనంతరం జనవరి 3 నుంచి 7 వరకు జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇదే సిరీస్ ముగిసిన వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించి ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
వివరాలు
WTC ఫైనల్ నుంచి 2027 ప్రపంచకప్ వరకు
2027 ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ జరగనుంది. అనంతరం జూలైలో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్నింటికంటే ముఖ్యంగా, 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది