IPL 2027: ఐపీఎల్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు.. హెడ్‌కోచ్‌గా మహేల ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2027 (IPL 2027)కు ముందు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీలో కీలక మార్పు చోటుచేసుకుంది. జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి మహేల జయవర్దనే వైదొలిగారు. పరస్పర అంగీకారంతో ముంబయి ఇండియన్స్‌తో తన అనుబంధానికి ముగింపు పలికారు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలో కోచ్ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రాబోయే సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మ (Rohit Sharma)కే అప్పగించనున్నారనే ఊహాగానాలు ఇటీవల వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహేల జయవర్దనే హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
వివరాలు
మహేలతో అనుబంధంపై ముంబయి ఇండియన్స్ పోస్ట్
మహేల జయవర్దనే హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయాన్ని ముంబయి ఇండియన్స్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఆయన నాయకత్వంలో జట్టు మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంది.
మహేలతో తమకు హెడ్‌కోచ్-ఫ్రాంచైజీ సంబంధానికి మించిన అనుబంధం ఉందని పేర్కొంది.
వివరాలు
అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన జయవర్దనే
తన వైదొలగడంపై మహేల జయవర్దనే కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముంబయి ఇండియన్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
'ముంబయి ఇండియన్స్‌తో నా దశాబ్దకాల ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. ఆటగాళ్లు, కోచింగ్ బృందం అందించిన సహకారం మరువలేనిది.
ముఖ్యంగా అభిమానుల నుంచి లభించిన మద్దతు ఎప్పటికీ గుర్తుండిపోతుంది'' అని జయవర్దనే పేర్కొన్నారు.
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబయి ఇండియన్స్.. గత కొన్ని సీజన్లలో ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.
2027 సీజన్‌కు ముందు కోచింగ్ బాధ్యతల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం, కెప్టెన్సీపై వినిపిస్తున్న ఊహాగానాలు జట్టు భవిష్యత్తుపై ఆసక్తిని పెంచుతున్నాయి.