Asian Para Games 2026: ఆసియా పారా గేమ్స్‌లో భారత్ బోణీ.. షూటింగ్‌లో మోనా అగర్వాల్‌కు స్వర్ణం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా పారా గేమ్స్‌లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. షూటింగ్‌లో భారత క్రీడాకారిణులు సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో భారత షూటర్లు మోనా అగర్వాల్, అవని లేఖర ఫైనల్‌లో తలపడ్డారు. ఈ పోరులో మోనా అగర్వాల్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవని లేఖర కేవలం 0.4 పాయింట్ల తేడాతో రజత పతకంతో సరిపెట్టుకుంది. మోనా అగర్వాల్ మొత్తం 250 పాయింట్లు సాధించగా.. అవని లేఖర 249.6 పాయింట్లు రాబట్టింది. దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రి 227.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణం, రజతం రెండూ లభించాయి.
వివరాలు
జూడోలో భారత్‌కు పతకం ఖాయం
మహిళల జూడో 52 కేజీల జే2 విభాగంలో భారత క్రీడాకారిణి కోకిల అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది.
దీంతో ఈ విభాగంలో భారత్‌కు పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో కోకిల 1-0 ఆధిక్యంతో చైనాకు చెందిన యు లియుపై విజయం సాధించింది.
ఫైనల్లో స్వర్ణ పతకం కోసం కజకిస్థాన్‌కు చెందిన ఐబికె ఉలాన్బెక్‌తో కోకిల తలపడనుంది. మరోవైపు, పురుషుల జూడో 70 కేజీల జే1 విభాగంలో భారత క్రీడాకారుడు కపిల్ పర్మార్‌కు నిరాశ ఎదురైంది.
సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జునాయిది చేతిలో కపిల్ 0-1 తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ ఆయనకు కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది.
కాంస్యం కోసం ఇండోనేషియాకు చెందిన అహ్నాఫ్ రఫ్లితో కపిల్ పోటీ పడనున్నాడు.
వివరాలు
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పతకం ఖాయం
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు పతకం ఖాయమైంది. నితీశ్ కుమార్, తులసిమతి మురుగేశన్ జోడీ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
గ్రూప్-బిలో అజేయంగా నిలిచిన భారత జోడీ సెమీస్‌లో చోటు సంపాదించింది. ఈ జోడీకి తొలి మ్యాచ్‌లో వాకోవర్ లభించింది.
రెండో మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ పెంగ్‌ఫెయి-హువాంగ్ జోడీతో తలపడ్డ భారత క్రీడాకారులు 21-4, 21-18 తేడాతో విజయం సాధించారు.
ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు చేరిన భారత్ మరో పతకంపై ఆశలు పెంచుకుంది.
వివరాలు
శీతల్ దేవి సూపర్ రికార్డు
పారా మహిళా ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో క్వాలిఫికేషన్ రౌండ్ సందర్భంగా ఆసియా గేమ్స్ రికార్డును నమోదు చేయడంతో పాటు ప్రపంచ రికార్డును సమం చేసింది.
మహిళల కాంపౌండ్ ఆర్చరీ క్వాలిఫికేషన్‌లో మొత్తం 750 పాయింట్లకు గాను శీతల్ దేవి 702 పాయింట్లు సాధించింది.
చేతులు లేకపోయినా కాళ్ల సాయంతోనే ఆర్చరీలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆమె.. తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆసియా రికార్డును నమోదు చేయడంతో పాటు ప్రపంచ రికార్డును సమం చేసి భారత్‌కు గర్వకారణంగా నిలిచింది.