India Women's Cricket Team: హర్మన్‌ప్రీత్ సేన చరిత్రకు ఏడాది.. ప్రపంచకప్ గెలుపు జ్ఞాపకాలను పంచుకున్న బీసీసీఐ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ చరిత్రలో 2025 నవంబర్ 2 చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ చారిత్రక విజయానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
వివరాలు
'కలల నుంచి గమ్యం వైపు ప్రయాణం'.. బీసీసీఐ వీడియో
ప్రపంచకప్ విజయానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొస్తూ బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను పంచుకుంది.
"ఎంతో ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్.. కలల నుంచి గమ్యం వైపు సాగిన ఆ ప్రయాణం. మనం ఛాంపియన్లుగా నిలిచి ఏడాది పూర్తయ్యిందంటూ క్యాప్షన్ జతచేసింది.
ఈ వీడియో ద్వారా భారత మహిళల జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని మరోసారి గుర్తుచేసింది.
వివరాలు
ఫైనల్లో భారత్ భారీ స్కోరు
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతంగా ఆడి 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీప్తి శర్మ 58 పరుగులు చేయగా.. స్మృతి మంధాన 45 పరుగులతో రాణించింది.
దీంతో దక్షిణాఫ్రికా ముందు భారత్ 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
వివరాలు
దీప్తి శర్మ ఐదు వికెట్లతో అదుర్స్
299 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది.
ఆమె 101 పరుగులు సాధించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు.
దీంతో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
షఫాలీ వర్మ రెండు వికెట్లు తీయగా.. శ్రీ చరణి ఒక వికెట్ సాధించింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వివరాలు
మహిళా క్రికెట్‌కు కొత్త గుర్తింపు
ఈ విజయం భారత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీని అందించడమే కాకుండా.. దేశంలో మహిళల క్రికెట్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది.
ఈ చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఎంతోమంది యువతులకు క్రికెటర్ కావాలనే తమ కలను నిజం చేసుకోవచ్చనే నమ్మకం కలిగింది.
ప్రపంచకప్ గెలిచి ఏడాది గడిచినా.. ఆ చారిత్రక క్షణాలకు సంబంధించిన జ్ఞాపకాలు అభిమానుల మనసుల్లో ఇంకా తాజాగా ఉన్నాయి.