LOADING...
Sunil Gavaskar: 'ముందు సింగిల్ తియ్యి'.. అభిషేక్‌కు సునిల్ గావస్కర్ సూచనలు
'ముందు సింగిల్ తియ్యి'.. అభిషేక్‌కు సునిల్ గావస్కర్ సూచనలు

Sunil Gavaskar: 'ముందు సింగిల్ తియ్యి'.. అభిషేక్‌కు సునిల్ గావస్కర్ సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టుకు విధ్వంసకర ఆరంభాలు అందించే ఓపెనర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్ శర్మ ప్రస్తుతం నిరాశాజనక ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 పోటీలో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా నిలిచిన అతడు ఇప్పటివరకు ఒక్క పరుగూ నమోదు చేయలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఖాతా తెరవకుండానే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరి, లీగ్ దశను నిరాశకరంగా ముగించాడు. గ్రూప్-ఎలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా అవుటైన అభిషేక్ శర్మ, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పరుగులేమీ చేయలేకపోయాడు. తాజాగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోటీలోనూ అదే పరిస్థితి ఎదురైంది.

వివరాలు 

ఎనిమిది బంతులు మాత్రమే

ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి ఆడుతున్న ఈ ఎడమచేతి బ్యాటర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి మొత్తం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అతడు, లీగ్ దశలో అమెరికా, నెదర్లాండ్స్ వంటి జట్లపై కూడా కనీసం సింగిల్ సాధించలేకపోయాడు. దీంతో అనవసరమైన చెత్త రికార్డును తన ఖాతాలో చేర్చుకున్నాడు.

వివరాలు 

తెలివిగా ఆడు

ఈ పరిస్థితిపై భారత క్రికెట్ దిగ్గజం Sunil Gavaskar కీలక వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. తనపై ఉన్న ట్యాగ్‌లను పక్కనబెట్టి సహజశైలిలో ఆడితేనే మంచి ఫలితాలు సాధించగలడని అభిప్రాయపడ్డారు. తొందరపడకుండా జాగ్రత్తగా షాట్లు ఎంచుకోవాలని సూచించారు. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ, "అంచనాల భారం అతడిపై ప్రభావం చూపుతోంది. అతడు ప్రతిభావంతుడైన బ్యాటర్. ఒకసారి లయలోకి వచ్చాడంటే తనదైన శైలిలో పరుగులు సాధించగలడు. కానీ ప్రస్తుత పరిస్థితి అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది" అని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

ముందుగా సింగిల్‌ తీయాలి

సిక్సర్లు బాదే ఆటగాడిగా పేరుగాంచిన అభిషేక్, ఆ పేరుకి తగిన ప్రదర్శన ఇవ్వాలనే ఆలోచనతో మరింత ఒత్తిడికి లోనవుతున్నాడని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అనే గుర్తింపు కూడా అతడిపై మానసిక భారాన్ని పెంచుతుందని చెప్పారు. మొదటి బంతి నుంచే బౌండరీ లేదా సిక్సర్ కోసం ప్రయత్నించడం సరైన విధానం కాదని హెచ్చరించారు. ముందుగా సింగిల్ తీసుకుని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని, తెలివిగా ఆడాలని, ముఖ్యంగా కాళ్ల కదలికలను సరిగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు.

Advertisement

వివరాలు 

లీగ్ దశను అజేయంగా పూర్తి చేసిన టీమిండియా 

ఇప్పటివరకు అవుటైన తీరు చాలా సాధారణంగా ఉందని, అతడి షాట్ ఎంపికను బట్టి బౌలర్లు ముందే అంచనా వేయగలరని తెలిపారు. 'ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసే ఆటగాడిగానే నన్ను చూస్తారు' అన్న భావన నుంచి బయటపడాలని, ఆ ఆలోచనను మనసులోనుంచి తొలగించాలని సలహా ఇచ్చారు. సహజమైన ఆటతీరు ప్రదర్శిస్తే తప్పక పెద్ద స్కోర్లు సాధించగలడని గావస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, గ్రూప్-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్ జట్లపై విజయాలు సాధించిన భారత జట్టు, చివరిగా నెదర్లాండ్స్‌పై గెలిచి లీగ్ దశను అజేయంగా పూర్తి చేసింది.

Advertisement