Prithvi Shaw: పృథ్వీ షాతో విభేదాల్లేవు.. సోషల్ మీడియాలో ఆకృతి క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
పృథ్వీ షాతో తనకు బ్రేకప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆకృతి అగర్వాల్ పూర్తిగా ఖండించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని,తాము ఇప్పటికీ సంతోషంగానే కలిసి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వైరల్ అయిన ఊహాగానాలకు సోషల్ మీడియా వేదికగా ఆమె సమాధానం ఇచ్చారు. భారత క్రికెటర్ పృథ్వీ షా,ఆకృతి అగర్వాల్‌లకు ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగింది. అయితే రెండు రోజులక్రితం ఆకృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎవరి పేరును ప్రస్తావించకుండా ఒక భావోద్వేగ పోస్టు చేశారు. "నేను మోసపోయాను.అతడితో కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత ఇలా జరుగుతుందని ఊహించలేదు. అతడి గురించి సోషల్ మీడియాలో వినిపించినవన్నీ నిజమే. వదంతులన్నీ వాస్తవాలే"అంటూ ఆమె రాసుకొచ్చారు.
వివరాలు
పోస్టులో ఎక్కడా పృథ్వీ షా పేరును ప్రస్తావించని ఆకృతి
ఈ పోస్టు వైరల్ కావడంతో అది పృథ్వీ షాను ఉద్దేశించినదేనని పలువురు భావించారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, నిశ్చితార్థం కూడా రద్దయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన ఆకృతి, తన పోస్టులో ఎక్కడా పృథ్వీ షా పేరును ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు ఆధారాలు లేకుండానే ఆ పోస్టును అతడితో ముడిపెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అలాంటి ప్రచారం వల్ల పృథ్వీ షా ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి రావడంతో తాను స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
వివరాలు
మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నాం: ఆకృతి
"ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎక్కడా నా కాబోయే భర్త పేరును ప్రస్తావించలేదు. అలాగే మా నిశ్చితార్థం రద్దయిందని గానీ, మేము విడిపోయామని గానీ ఎప్పుడూ చెప్పలేదు. అయినా చాలామంది ఆ పోస్టును పృథ్వీ షాతో అనుసంధానించడం నిజంగా దురదృష్టకరం. మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నాం. మా బంధం అలాగే కొనసాగుతోంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠ, గౌరవం ఎంత సులభంగా దెబ్బతింటాయో ఈ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది" అని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
ఐపీఎల్ 2026 దిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా
అలాగే, తాను ముందుగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్‌ను ఉద్దేశించినదేనని ఆకృతి వివరించారు. ఒక చిన్న పొరపాటు కారణంగా తాను ప్రేమించే వ్యక్తి అనవసరంగా విమర్శలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో పృథ్వీ షాను దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎంపిక చేసుకుంది. అయితే మొత్తం సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు.