Deepak Chahar : ఆయన్ను సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లాం.. లేకపోతే కష్టమే : దీపక్ చాహర్
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్(Deepak Chahar) దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కానున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తన తండ్రి లోకేంద్ర సింగ్ బాగోగులు చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కు చెప్పానని దీపక్ చాహర్ తెలిపాడు. తనని క్రికెటర్‌గా తీర్చిదిద్దిన తన తండ్రిని ఈ స్థితిలో వదలి వెళ్లలేనని దీపక్ చాహర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈనెల 10వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. తొలుత ఆడే టీ20 సిరీస్‌కు దీపక్ చాహర్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీపక్ చాహర్ కొన్ని విషయాలను వెల్లడించారు.
తాను ప్లేయర్ గా ఎదగడానికి నాన్న ఎంతో శ్రమించాడు : దీపక్ చాహర్
తాను సరైన సమయానికి తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, లేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారేదని దీపక్ చాహర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని, ఆస్ట్రేలియాతో ఐదో టీ20 సిరీస్ ఆడకపోవడానికి కారణం ఇదేనని ఆయన తెలిపారు. తన నాన్న ఆరోగ్యం తనకు చాలా ముఖ్యమని, తనని ప్లేయర్‌గా చేయడానికి ఆయన ఎంతో శ్రమించారని, అలాంటి తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే తాను మైదానంలో మనసు పెట్టి ఆడలేనని దీపక్ చాహర్ స్పష్టం చేశారు. నాన్న ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడిన తర్వాతే దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ప్రయాణమవుతానని, ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్టర్లతో మాట్లాడనని చెప్పాడు.