Arshdeep Singh: టెస్టు జట్టులో చోటే లక్ష్యం.. అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాలన్నదే తన లక్ష్యమని పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్పష్టం చేశాడు. 27 ఏళ్ల ఈ బౌలర్ ఇప్పటివరకు ప్రధానంగా వైట్‌బాల్ క్రికెట్‌లోనే తన సత్తా చాటాడు. అయితే టెస్టు క్రికెట్‌లోనూ రాణించేందుకు ఆఫ్‌సీజన్‌లో రెడ్‌బాల్‌తో ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడు. ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా వెస్ట్‌జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌లో అర్ష్‌దీప్ తన బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కూడా అతడు మంచి లయతో బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా ఎర్ర బంతితో స్వింగ్‌ను కూడా రాబట్టగలిగాడు.
వివరాలు
టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురుచూపులు..
అర్ష్‌దీప్ 2019 డిసెంబరులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అయితే ఇప్పటివరకు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకుని అరంగేట్రం చేయలేకపోయాడు.
మరోవైపు వన్డేలు, టీ20ల్లో మాత్రం ఇప్పటికే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ఇప్పటివరకు 18 వన్డేలు, 91 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టులో అర్ష్‌దీప్కు చోటు లభించినప్పటికీ.. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలోనూ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
అయినప్పటికీ రెడ్‌బాల్ క్రికెట్‌లో తనకు భవిష్యత్తు ఉందన్న నమ్మకంతో అతడు ముందుకు సాగుతున్నాడు.
వివరాలు
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడటమే లక్ష్యం
ఆఫ్‌సీజన్‌లోనే రెడ్‌బాల్‌తో సాధన చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌పై తన ఆసక్తిని అరశ్‌దీప్ చాటుతున్నాడు.
దులీప్ ట్రోఫీకి రావడానికి ముందే రెడ్‌బాల్‌తో బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపాడు.
"భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే ఎప్పుడూ నా లక్ష్యం. అది ఏ ఫార్మాట్ అయినా నాకు ఒకటే. నేను కూడా మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నాను.
అయితే రెడ్‌బాల్ క్రికెట్ ఆడే అవకాశాలు నాకు చాలా అరుదుగా వస్తుంటాయి" అని అర్ష్‌దీప్ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో చెప్పాడు.
వివరాలు
కెంట్ తరఫున కౌంటీ క్రికెట్
రెడ్‌బాల్ క్రికెట్‌లోని సవాళ్లను స్వీకరించేందుకు అర్ష్‌దీప్ ఎంత ఆసక్తిగా ఉన్నాడో 2023లో కెంట్ తరఫున ఆడిన కౌంటీ క్రికెట్ కూడా చూపించింది.
ఆ అనుభవం అతడికి సుదీర్ఘ ఫార్మాట్‌పై మరింత అవగాహన కల్పించింది. ఇప్పుడు మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్ష్‌దీప్ భావిస్తున్నాడు.
ఆదివారం ప్రారంభం కానున్న సెమీఫైనల్లో నార్త్ జట్టు బౌలింగ్ విభాగానికి అతడే నాయకత్వం వహించనున్నాడు.
భారత జట్టు మేనేజ్‌మెంట్ కూడా తనకు స్పష్టమైన సందేశం ఇచ్చిందని అర్ష్‌దీప్ వెల్లడించాడు.
"ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ అత్యుత్తమంగా రాణించాలి. నిరంతరం మంచి ప్రదర్శనలు ఇస్తూ ఉండాలి.
నీకు అవకాశం రావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది" అని టీమ్ మేనేజ్‌మెంట్ తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు.