Loading...
Virender Sehwag: వీరూ స్టైల్‌లో ఆర్యవీర్‌.. తండ్రిని తలపించే షాట్లతో అదరగొట్టాడు
వీరూ స్టైల్‌లో ఆర్యవీర్‌.. తండ్రిని తలపించే షాట్లతో అదరగొట్టాడు

Virender Sehwag: వీరూ స్టైల్‌లో ఆర్యవీర్‌.. తండ్రిని తలపించే షాట్లతో అదరగొట్టాడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాట్‌ నుంచి వచ్చే షాట్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇప్పుడు దాదాపు అదే తరహా షాట్లను ఆయన కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ఆడుతుండటంతో క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌)లో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ తరఫున ఆడుతున్న ఆర్యవీర్‌.. తన తండ్రి బ్యాటింగ్‌ శైలిని తలపించే షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆర్యవీర్‌ ఆడిన కొన్ని షాట్లను డీపీఎల్‌ నిర్వాహకులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ముఖ్యంగా అతడు ఆడిన స్క్వేర్‌ డ్రైవ్‌, కవర్‌ డ్రైవ్‌లు వీరేంద్ర సెహ్వాగ్‌ శైలిని గుర్తు చేశాయి. తండ్రి, కుమారుడు ఆడిన షాట్లను పోల్చుతూ రూపొందించిన వీడియో ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.

వివరాలు

తండ్రి బాటలోనే ఆర్యవీర్‌..

ఆర్యవీర్‌ బ్యాటింగ్‌లో సెహ్వాగ్‌ శైలి కనిపిస్తుండటంతో అతడిపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

భారత క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ దూకుడైన బ్యాటింగ్‌కు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఆయన 17,253 పరుగులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 38 శతకాలు బాదారు.

ముఖ్యంగా తన సహజమైన దూకుడైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆర్యవీర్‌ కూడా తండ్రిని తలపించే షాట్లు ఆడుతుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఆర్యవీర్‌ బ్యాటింగ్‌ శైలిని సెహ్వాగ్‌తో పోలుస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు.

వివరాలు

వెస్ట్‌ ఢిల్లీకి ఓటమి

డీపీఎల్‌లో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 232/8 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌.. 20 ఓవర్లలో 211/8 పరుగులకే పరిమితమైంది.

దీంతో 21 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడు త్వరగానే ఔటయ్యాడు.

అయితే క్రిష్‌ యాదవ్‌ 46 పరుగులు, అంకిత్‌ కుమార్‌ 61 పరుగులతో పోరాటం చేశారు. అయినప్పటికీ వీరి ప్రయత్నాలు వెస్ట్‌ ఢిల్లీని విజయతీరాలకు చేర్చలేకపోయాయి.

ADVERTISEMENT