LOADING...
Australia: మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి మరో నిదర్శనం.. ఏడో టీ20 ప్రపంచకప్ సొంతం
పేరు కంగారూ.. ఆట బంగారు

Australia: మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి మరో నిదర్శనం.. ఏడో టీ20 ప్రపంచకప్ సొంతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లలో ఒత్తిడి మొదలవుతుంది. పురుషుల క్రికెట్‌లోనే కాదు.. మహిళల క్రికెట్‌లోనూ కంగారూ జట్టు అదే స్థాయి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రొఫెషనల్ దృక్పథం, క్రమశిక్షణ, సమష్టి ప్రదర్శనకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన ఆసీస్ మహిళల జట్టు ప్రపంచ క్రికెట్‌పై తన ముద్ర వేసింది. చెప్పాలంటే పురుషుల జట్టు కంటే మహిళల జట్టే అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రభావం చూపించింది. టీ20 ప్రపంచకప్‌ను ఏకంగా ఏడుసార్లు కైవసం చేసుకోవడం ఆ జట్టు గొప్పతనాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. తాజా టోర్నీలోనూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూడకుండా టైటిల్‌ను అందుకోవడం ద్వారా తమ అప్రతిహత ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.

వివరాలు 

చిన్న జట్టా,పెద్ద జట్టా అనే తేడా లేకుండా..

టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కెప్టెన్ అలీస్సా హీలీ నేతృత్వంలోని జట్టు ఆ పరిస్థితిని అధిగమించి విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ మినహా మిగతా పోటీల్లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. చిన్న జట్టా,పెద్ద జట్టా అనే తేడా లేకుండా ప్రతి మ్యాచ్‌లోనూ ఆసీస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికాపై 65 పరుగుల తేడాతో టోర్నీని ఘనంగా ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అనంతరం బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేయగా.. నెదర్లాండ్స్‌ను 98 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది.

వివరాలు 

విజయాలను అందుకోవడంలో ఆస్ట్రేలియా మహిళ జట్టు ప్రత్యేకత

ఆష్లీ గార్డ్‌నర్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్ వంటి ప్రపంచస్థాయి ఆల్‌రౌండర్లు జట్టుకు ప్రధాన బలంగా నిలిచారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్రతి విభాగంలోనూ సమతూకాన్ని ప్రదర్శించిన ఆసీస్‌ను అడ్డుకోవడం ఏ జట్టు వల్లా సాధ్యం కాలేదు. ఇతర జట్ల మాదిరిగా ఒత్తిడికి లొంగిపోవడం ఆస్ట్రేలియా స్వభావం కాదు. క్లిష్ట పరిస్థితుల్లోనే ఆ జట్టు ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తారు. పురుషుల జట్టు తరహాలోనే మహిళల జట్టు కూడా సవాళ్లను మరింత పట్టుదలతో ఎదుర్కొంటూ విజయాలను అందుకోవడంలో ప్రత్యేకతను చాటుతోంది.

Advertisement

వివరాలు 

తిరుగులేని ప్రదర్శన

గత ఏడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోవడం, అనంతరం స్వదేశంలో భారత జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను కోల్పోవడంతో ఆస్ట్రేలియా బలం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా ప్రపంచకప్‌లో తిరుగులేని ప్రదర్శనతో అలాంటి సందేహాలన్నింటికీ తెరదించి, మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Advertisement