మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు టీ20ల్లో విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు, మూడో టీ20ల్లో మాత్రం చేతులెత్తేసింది. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. బంగ్లా 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానా (1) నిరాశపరిచగా, షెఫాలీ వర్మ 11 పరుగులతో పెవిలియానికి చేరింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్
బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్ 3 వికెట్ల తీయగా, సుల్తానా ఖాతున్ 2 వికెట్లతో చెలరేగారు. 103 పరుగుల లక్ష్య చేధనకు దిగిన బంగ్లా బ్యాటర్లలో సమీమా సుల్తానా అద్భుతంగా రాణించింది. 46 బంతుల్లో 42 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక టీ20 సిరీస్‌లో 94 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ' ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' దక్కింది. సెమీమా సుల్తానాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ జూలై 16 నుంచి ప్రారంభం కానుంది.