LOADING...
IPL Finals: ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్.. బెంగళూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు
ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్.. బెంగళూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు

IPL Finals: ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్.. బెంగళూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు

వ్రాసిన వారు Moogati Shabari
May 31, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముగింపు పలికే ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత సీజన్‌లో ఆర్సీబీ విజయం అనంతరం చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో జరిగిన సంబరాల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టు వరుసగా రెండో టైటిల్ కోసం పోటీపడుతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఆర్సీబీ విజయం సాధించినా, ఓటమి పాలైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

వివరాలు

పోలీసులు జారీ చేసిన ముఖ్య ఆంక్షలు ఇవే..

విజయోత్సవాల పేరుతో బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున గుమిగూడరాదు. అధికారుల ముందస్తు అనుమతి లేకుండా రహదారులపై ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడం నిషేధం. మాల్స్, పబ్స్ తదితర వాణిజ్య సంస్థలు ప్రజలకు బయట నుంచి కనిపించే విధంగా స్క్రీన్‌లను ఏర్పాటు చేయకూడదు. మ్యాచ్ ముగిసిన అనంతరం రోడ్లపై బైక్ స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్‌లు మోగించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది.

వివరాలు

రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు..

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లేదా హింసాత్మక చర్యలకు పాల్పడడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మ్యాచ్‌కు సంబంధించి రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో ప్రచురించడం, తప్పుడు ప్రచారం చేయడం లేదా పుకార్లు వ్యాప్తి చేయడం అనుమతించబడదు. అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, చట్టాన్ని గౌరవిస్తూ మ్యాచ్ ఉత్సాహాన్ని ఆస్వాదించాలని పోలీసులు సూచించారు.

Advertisement