Loading...
Pakistan Cricket: పాకిస్థాన్‌ క్రికెట్‌కు బిగ్‌ షాక్‌.. సగం కంటే తక్కువ ధరకే ప్రసార హక్కుల విక్రయం!
పాకిస్థాన్‌ క్రికెట్‌కు బిగ్‌ షాక్‌.. సగం కంటే తక్కువ ధరకే ప్రసార హక్కుల విక్రయం!

Pakistan Cricket: పాకిస్థాన్‌ క్రికెట్‌కు బిగ్‌ షాక్‌.. సగం కంటే తక్కువ ధరకే ప్రసార హక్కుల విక్రయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌లోనే జరగనున్న 25 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను పీసీబీ రిజర్వ్‌ ధరలో సగానికంటే తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిడ్డింగ్‌లో కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీటీవీ (Pakistan Television Corporation) మాత్రమే పాల్గొనడంతో.. పీసీబీ నిర్ణయించిన రూ.600 మిలియన్ల రిజర్వ్‌ ధరకు బదులుగా రూ.350 మిలియన్లకే ప్రసార హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని పలు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం పీసీబీ టెండర్‌ విడుదల చేసింది. అయితే గతంలో మాదిరిగా ఆసక్తి ఉన్న బ్రాడ్‌కాస్టర్లు కన్సార్టియంగా ఏర్పడి బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఈసారి అనుమతించలేదు.

వివరాలు

25 అంతర్జాతీయ హోమ్‌ మ్యాచ్‌లు

దీంతో బిడ్డింగ్‌లో పోటీ గణనీయంగా తగ్గింది. చివరకు ఒక్క పీటీవీ మాత్రమే బిడ్‌ దాఖలు చేయడంతో.. రూ.600 మిలియన్ల రిజర్వ్‌ ధర ఉన్న ప్రసార హక్కులు రూ.350 మిలియన్లకే అమ్ముడయ్యాయి.

తాజా ఒప్పందంలో మొత్తం 25 అంతర్జాతీయ హోమ్‌ మ్యాచ్‌లు ఉన్నాయి.

వీటిలో ఐదు టెస్టులు, 14 వన్డేలు, ఆరు టీ20లున్నాయి. పాకిస్థాన్‌ ఈ నెలలో శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

అనంతరం ఏడు మ్యాచ్‌ల త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో పాల్గొననుంది. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు కూడా షెడ్యూల్‌ అయ్యాయి.

వివరాలు

జట్టు ప్రదర్శనపైనా ప్రభావం..

పాకిస్థాన్‌ జాతీయ జట్టు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా ప్రసార హక్కులపై ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణమని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.

జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో స్పాన్సర్లు, ప్రకటనదారులు ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

మరోవైపు గతంలో కన్సార్టియాలుగా ఏర్పడి పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న కనీసం మూడు బ్రాడ్‌కాస్టర్లు ఇప్పటికీ పీసీబీకి డబ్బులు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.

ఈ బకాయిల సమస్య కూడా తాజా బిడ్డింగ్‌లో పోటీదారుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

బకాయిలు ఉన్న బ్రాడ్‌కాస్టర్లను బిడ్డింగ్‌లో పాల్గొనకుండా పీసీబీ నిషేధించలేదని.. అయితే వారు స్వయంగా ఈసారి టెండర్‌లో పాల్గొనలేదని సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఐర్లాండ్‌, జింబాబ్వే సిరీస్‌ల ప్రసార హక్కులూ ఇందులోనే..

గతంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రసార హక్కుల్లో ఎక్కువ భాగాన్ని దక్కించుకున్న ఓ సంస్థ కూడా ఈసారి ఆసక్తి చూపలేదు.

ప్రస్తుతం కుదిరిన ఒప్పందం ప్రకారం 2027 జనవరిలో ఐర్లాండ్‌తో పాకిస్థాన్‌ ఆడనున్న మూడు టీ20 మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా ఇందులో ఉన్నాయి.

అలాగే ఐర్లాండ్‌, జింబాబ్వే పాల్గొనే ఏడు మ్యాచ్‌ల త్రైపాక్షిక సిరీస్‌ ప్రసార హక్కులు కూడా తాజా ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.

అయితే జింబాబ్వే క్రికెట్‌ బోర్డులో నెలకొన్న అంతర్గత సమస్యల కారణంగా ఆ జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు రావడం కష్టమేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

దీంతో ఈ త్రైపాక్షిక సిరీస్‌ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది.

ADVERTISEMENT

వివరాలు

పీఎస్‌ఎల్‌లోనూ ఇదే పరిస్థితి..

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 11వ ఎడిషన్‌ సమయంలోనూ పీసీబీకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

ఈ ఏడాది జరిగిన పీఎస్‌ఎల్‌లో రెండు కొత్త జట్లను చేర్చినప్పటికీ.. ప్రసార హక్కుల కోసం పీసీబీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని సమాచారం.

గతేడాది పీఎస్‌ఎల్‌ ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ఓ బ్రాడ్‌కాస్టర్‌ కూడా పీసీబీకి బిలియన్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆర్థిక పరిస్థితులతో పాటు దేశ క్రికెట్‌ ప్రసార హక్కుల మార్కెట్‌పైనా ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

వివరాలు

ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం

అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను రిజర్వ్‌ ధరలో సగానికంటే ఎక్కువ తగ్గించి విక్రయించాల్సి రావడం పీసీబీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.

జాతీయ జట్టు ప్రదర్శన, బ్రాడ్‌కాస్టర్ల బకాయిలు, స్పాన్సర్ల ఆసక్తి తగ్గడం వంటి అంశాలు పాకిస్థాన్‌ క్రికెట్‌ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT