BWF RANKINGS : సత్తా చాటిన భారత షట్లర్లు ప్రణయ్, లక్ష్యసేన్
ఇండియన్ స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ (BWF Rankings)లో సత్తా చాటారు. ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ప్రణయ్ 9వ స్థానం, లక్ష్యసేన్ 11వ ర్యాంకుకు దూసుకెళ్లారు. ఇటీవలే ముగిసిన జపాన్ ఓపెన్ సూపర్ 750 (Japan Open Super) బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు అదరహో అనిపించారు. లక్ష్యసేన్ అయితే ఏకంగా సెమీస్‌కు దూసుకెళ్లాడు. కానీ ఇండోనేషియా ప్లేయర్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓడిపోయాడు. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ ర్యాంకింగ్స్ స్థానాన్ని మెరుగుపరుచుకోవడం విశేషం.
19వ ర్యాంక్‌లో కొనసాగుతున్న మరో స్టార్ షట్లర్ శ్రీకాంత్
మరో ఇండియన్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓ అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం 19వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు నేషనల్ చాంపియన్ మిధున్ మంజునాత్ గణనీయంగా 4 స్థానాల మేర ఎగబాకాడు. దీంతో 50వ ర్యాంక్ సంపాదించాడు. ఇక మహిళల ర్యాంక్సింగ్స్‌లో పీవీ సింధు 17వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది తాను ఆడిన టోర్నమెంట్‌లల్లో క్వార్టర్స్ దశనూ దాటలేకపోయింది. గత పది సంవత్సరాల కాలంలో సింధుకు ఇదే తక్కువ ర్యాంక్ కావడం గమనార్హం. ఇక సాత్విక్ - చిరాగ్ శెట్టీ డబుల్స్‌లో దుమ్మురేపుతున్నారు. ఇటీవలే మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపిచంద్, త్రీసా జాలీ 17వ ర్యాంక్ సాధించారు.