LOADING...
Shubhman Gill: 77 బంతుల్లో సెంచరీ.. కెప్టెన్‌గా కొత్త రికార్డు సృష్టించిన గిల్
77 బంతుల్లో సెంచరీ.. కెప్టెన్‌గా కొత్త రికార్డు సృష్టించిన గిల్

Shubhman Gill: 77 బంతుల్లో సెంచరీ.. కెప్టెన్‌గా కొత్త రికార్డు సృష్టించిన గిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అఫ్గానిస్థాన్‌తో లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో గిల్ మరో శతకంతో మెరిశాడు. వన్డే కెరీర్‌లో ఇది అతడికి తొమ్మిదో సెంచరీ. మ్యాచ్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ త్వరగా ఔటైనప్పటికీ, గిల్ జట్టును చక్కగా నిలబెట్టాడు. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదిన గిల్, కేవలం 38 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అనంతరం అదే జోరును కొనసాగించి 77 బంతుల్లో శతకం నమోదు చేశాడు.

వివరాలు

వన్డేల్లో గిల్ రికార్డు ప్రస్థానం

ఈ సెంచరీతో గిల్ వన్డేల్లో తన శతకాల సంఖ్యను తొమ్మిదికి చేర్చుకున్నాడు. వీటిలో ఆరు సెంచరీలు స్వదేశంలోనే నమోదు కావడం విశేషం. ఇటీవలే అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ 84 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు మరోసారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డే సందర్భంగా గిల్ వన్డేల్లో 3,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనతను 62 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ మైలురాయిని మరింత వేగంగా చేరిన ఆటగాడు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా మాత్రమే. ఆయన 57 ఇన్నింగ్స్‌ల్లో 3,000పరుగులు పూర్తి చేశాడు. ఇప్పటివరకు గిల్ వన్డే కెరీర్‌లో 27 సార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేశాడు.

Advertisement