India vs Sri Lanka ODI 2026: భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు? ఢిల్లీ నుంచి మ్యాచ్ తరలింపునకు కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి ఈ మ్యాచ్‌ను మరో నగరానికి తరలించాలని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని కోరినట్లు సమాచారం. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంతో పాటు స్టేడియంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను ఇందుకు కారణాలుగా పేర్కొన్నట్లు క్రిక్‌బజ్ కథనం వెల్లడించింది.
వివరాలు
మ్యాచ్ వేదిక మార్చాలని బీసీసీఐకి డీడీసీఏ లేఖ
నిర్ణయించిన తేదీన మ్యాచ్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంటూ డీడీసీఏ.. బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటమే ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
గతేడాది డిసెంబర్‌లో దేశ రాజధానిలో సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 351గా నమోదైంది. నవంబర్ 2న కూడా ఇలాంటి స్థాయిలోనే కాలుష్యం నమోదైనట్లు సమాచారం.
వివరాలు
2017 టెస్టు మ్యాచ్ ఘటనతో ఆందోళన
స్టేడియం పునరుద్ధరణ పనుల కంటే ఢిల్లీలోని వాయు కాలుష్యమే మ్యాచ్ తరలింపునకు ప్రధాన కారణమని పరిణామాలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి క్రిక్‌బజ్‌కు వెల్లడించారు.
2017 డిసెంబర్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా కాలుష్యం కారణంగా శ్రీలంక ఆటగాళ్లు కొందరు అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత మ్యాచ్ నిర్వహణపై డీడీసీఏ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది మరో మ్యాచ్‌ను తమకు కేటాయించాలని కూడా బోర్డును కోరినట్లు సమాచారం.
వివరాలు
వేదిక మార్పుపై తొలుత బీసీసీఐ నిరాకరణ
తొలుత భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మారుతుందన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. మ్యాచ్‌ను మరో వేదికకు తరలించే ఆలోచన లేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
అయితే తాజాగా డీడీసీఏ స్వయంగా మ్యాచ్ వేదికను మార్చాలని కోరడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సి ఉంది.
రెండో వన్డే డిసెంబర్ 16న బెంగళూరులో, మూడో వన్డే డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
వివరాలు
ఐపీఎల్ 2027 వరకు స్టేడియంలో క్రికెట్ కష్టమే!
మరోవైపు అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ స్థాయిలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అవుట్‌ఫీల్డ్‌ను తొలగించి, ఇసుక ఆధారిత ఉపరితలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మైదానంలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఈ పనుల కారణంగా ఐపీఎల్ 2027 వరకు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.
పునరుద్ధరణ పనులు పూర్తయ్యేందుకు సుమారు నాలుగు నెలల సమయం పడుతుందని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి 'ది హిందూ'కు వెల్లడించారు.
దీంతో డిసెంబర్ 13న జరగాల్సిన భారత్-శ్రీలంక తొలి వన్డేను మరో వేదికకు తరలించే అవకాశాలు మరింత పెరిగాయి.