Loading...
Colombo Test: యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం
యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం

Colombo Test: యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్ 53 బంతుల్లో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటన దాదాపు భౌతిక ఘర్షణకు దారితీసేలా కనిపించింది. జైస్వాల్ ఔటైన తర్వాత పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఫెర్నాండో తన సహచరులతో కలిసి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సమయంలో ఫెర్నాండో ఏదో మాట్లాడటం జైస్వాల్ విన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని ఎదుర్కొనేందుకు జైస్వాల్ వెనక్కి వెళ్లాడు.

వివరాలు

జైస్వాల్ తీవ్ర ఆగ్రహం..

ఆ సమయంలో జైస్వాల్ తీవ్ర ఆగ్రహంతో కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడి దాదాపు తలలు ఢీకొట్టుకునేంత దగ్గరికి వెళ్లారు.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే ఓ శ్రీలంక ఆటగాడు జోక్యం చేసుకుని జైస్వాల్‌ను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు.

అంతకుముందు ఫెర్నాండో వేసిన ఓవర్‌లో జైస్వాల్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు.

ఆ తర్వాత జైస్వాల్‌ను ఔట్ చేసిన ఫెర్నాండో కూడా అదే స్థాయిలో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

వివరాలు

జైస్వాల్ 45 పరుగులు..

టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత్‌కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు.

వీరిద్దరూ కలిసి 37 పరుగులు జోడించారు. అయితే 11వ ఓవర్‌లో లహిరు కుమార బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యాడు.

ఆ తర్వాత జైస్వాల్, దేవదత్ పడిక్కల్ కలిసి మరో 29 పరుగులు జోడించారు.

ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్ మూడు బౌండరీలు బాదాడు. అయితే అదే బౌలర్ చివరకు జైస్వాల్ వికెట్‌ను పడగొట్టాడు.

జైస్వాల్ 53 బంతులు ఎదుర్కొని 45 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి.

ADVERTISEMENT