LOADING...
Phil Salt Catch Controversy: ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ ఫైనల్ తీర్పు ఇదే!
ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ ఫైనల్ తీర్పు ఇదే!

Phil Salt Catch Controversy: ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ ఫైనల్ తీర్పు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ తొలి మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం మూడు క్యాచులు అందుకున్న అతను మ్యాచ్ మలుపు తిప్పాడు. అయితే హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ మాత్రం కొంత వివాదానికి దారి తీసింది. రోమారియో షెపర్డ్ వేసిన బంతిని క్లాసెన్ లెగ్‌సైడ్ వైపు గాల్లోకి బలంగా కొట్టగా, డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ బౌండరీకి అత్యంత సమీపంలో క్యాచ్ అందుకున్నాడు.

వివరాలు

కొంతసేపు గందరగోళం అనంతరం ఔట్ గా ప్రకటన

క్యాచ్ తీసుకున్న వెంటనే క్లాసెన్ పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో బౌండరీ వద్ద సిబ్బంది అతడిని ఆపడంతో, విషయం థర్డ్ అంపైర్‌కు వెళ్లింది. పలు యాంగిల్స్‌లో రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ కొంతసేపు గందరగోళం అనంతరం ఔట్‌గా ప్రకటించారు. నిరాశతో క్లాసెన్ వెనుదిరిగాడు. అయితే ఈ నిర్ణయంపై అభిమానుల్లో పెద్ద చర్చ చెలరేగింది. కొందరు స్పష్టంగా ఔట్ అని భావిస్తే, మరికొందరు నాటౌట్ అని అభిప్రాయపడ్డారు. క్యాచ్ సమయంలో సాల్ట్ బౌండరీని తాకినట్టు ఒక యాంగిల్‌లో కనిపించగా, మరో కోణంలో తాకనట్టుగా స్పష్టమైంది. చివరికి థర్డ్ అంపైర్ తీర్పే సరైందని భావిస్తున్నారు.

వివరాలు

రాణించిన అనికేత్ వర్మ

ఇదిలా ఉండగా, తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడగా, అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లో 43 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ, కిషన్-క్లాసెన్ జోడీ 53 బంతుల్లో 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించింది. అనంతరం మళ్లీ వరుస వికెట్లు పడినా, అనికేత్ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో జట్టు 200 పరుగుల మార్క్‌ను దాటింది.

Advertisement

వివరాలు

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం

లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్లింది. దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులతో శుభారంభం అందించగా, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 నాటౌట్‌తో మ్యాచ్‌ను అద్భుతంగా ముగించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కేవలం 45 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, 15.4 ఓవర్లలోనే 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా జట్టుకు బలాన్నిచ్చారు. అంతిమంగా ఆర్సీబీ విజయపథంలో దూసుకెళ్లి ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement