Loading...
Suchika Tariyal: ఏషియన్‌ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర.. భారత్‌కు తొలి ఎంఎంఏ పతకం!
ఏషియన్‌ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర.. భారత్‌కు తొలి ఎంఎంఏ పతకం!

Suchika Tariyal: ఏషియన్‌ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర.. భారత్‌కు తొలి ఎంఎంఏ పతకం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (MMA)లో సుచికా తారియాల్‌ చరిత్ర సృష్టించింది. ఏషియన్‌ గేమ్స్‌లో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్‌ 60 కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం సాధించింది. ఏషియన్‌ గేమ్స్‌లో ఈసారి తొలిసారిగా ఎంఎంఏకు చోటు దక్కింది. సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియోతో సుచికా తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు అదనపు సమయానికి వెళ్లింది. చివరకు స్వల్ప తేడాతో సుచికా ఓటమి పాలైంది. దీంతో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.

వివరాలు

తొలి క్రీడాకారిణిగా రికార్డు

అయితే సెమీఫైనల్‌కు చేరినప్పుడే ఆమెకు కాంస్య పతకం ఖాయమైంది. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్టాన్‌చిమెగ్‌ బైగల్మాను సుచికా 2-0తో ఓడించింది.

ఈ విజయంతో ఏషియన్‌ గేమ్స్‌లో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేసిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.

36 ఏళ్ల సుచికా తారియాల్‌ క్రీడా ప్రయాణం కేవలం ఎంఎంఏకే పరిమితం కాలేదు.

జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె.. 2022లో జరిగిన బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొంది. ఆ తర్వాత 2023 ఏషియన్‌ గేమ్స్‌లో కురాష్‌ విభాగంలోనూ పోటీ పడింది.

వివరాలు

సుచికా తారియాల్‌కు ప్రత్యేక స్థానం

అనంతరం జియూ-జిట్సులోనూ సుచికా సత్తా చాటింది. 2024లో ఫైటింగ్‌ జియూ-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

ఇలా పలు మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో పోటీ పడుతూ తన ప్రతిభను చాటుకుంది. సుచికా 2017లో ఎంఎంఏలో ప్రొఫెషనల్‌గా అరంగేట్రం చేసింది.

జూడో, జియూ-జిట్సుపై దృష్టి పెట్టడంతో కొన్నేళ్లపాటు ఎంఎంఏకు దూరంగా ఉంది. 2024లో మళ్లీ ఎంఎంఏలోకి తిరిగి వచ్చిన ఆమె.. 'బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌'తో ఒప్పందం చేసుకుంది.

గాయంతో పాటు ఇతర అడ్డంకులను అధిగమించి తిరిగి ఎంఎంఏలోకి వచ్చిన సుచికా.. ఇప్పుడు ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాన్ని అందించింది.

ఏషియన్‌ గేమ్స్‌లో ఎంఎంఏ తొలిసారి ప్రవేశించిన వెంటనే భారత్‌కు పతకం రావడం విశేషం.

భారత ఎంఎంఏ చరిత్రలో సుచికా తారియాల్‌కు ప్రత్యేక స్థానం దక్కింది.

ADVERTISEMENT