Sourav Ganguly: ఈడెన్ పిచ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన గంగూలీ !
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్ట్ మూడు రోజుల్లోనే పూర్తయిన విషయం పెద్దగా చర్చనీయాంశమైంది. పిచ్ నాణ్యతపై వచ్చిన విమర్శలకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ స్పందించారు. పిచ్ రూపకల్పనలో తమకు ఎలాంటి అధికారమూ ఉండదని, మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు నుంచే బీసీసీఐ క్యురేటర్లు దానిని స్వాధీనపరుచుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల చిన్న లక్ష్యాన్నికూడా చేరుకోలేక ఓటమి చవిచూసింది. పిచ్ నుంచి అనూహ్యంగా వచ్చిన టర్న్, అసమాన బౌన్స్ కారణంగా ఇరు జట్ల బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
వివరాలు
ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ గొప్పగా ఏమీ లేదు: గంగూలీ
ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ, "పిచ్ తయారీలో నా ప్రమేయం ఏమాత్రం ఉండదు. టెస్ట్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ క్యురేటర్లు వస్తారు, వారి నిర్ణయాల ప్రకారమే ఏర్పాట్లు జరుగుతాయి. టీమ్ మేనేజ్‌మెంట్ కోరిన విధంగానే వారు పిచ్‌ను తయారు చేస్తారు" అని తెలిపారు. అయితే, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ గొప్పగా ఏమీ లేదని గంగూలీ అంగీకరించాడు. "ఈ పిచ్ అంత గొప్పది కాదనేది నిజం. భారత టాప్ ఆర్డర్,మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇంతకంటే మెరుగైన ఉపరితలంపై ఆడటానికి అర్హులు"అని వ్యాఖ్యానించారు. గౌతమ్ గంభీర్ విజ్ఞప్తి మేరకే ఈ రకమైన పిచ్‌ను సిద్ధం చేశారని కూడా గంగూలీ వెల్లడించారు.
వివరాలు
0 వికెట్లు తీయగల సామర్థ్యం భారత బౌలర్లకు ఉంది: గంగూలీ
"మ్యాచ్ తర్వాత గంభీర్ స్వయంగా తన అభ్యర్థనకు అనుగుణంగానే పిచ్ రూపొందించారని చెప్పాడు. కెప్టెన్, కోచ్ కోరినదానికే ప్రాధాన్యం ఇస్తాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమి తరువాత గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించాలని వస్తున్న మాటలను గంగూలీ ఖండించారు. "అలాంటి నిర్ణయం గురించి ఆలోచించే అవసరం లేదు. ఇంగ్లండ్‌లో మంచి పిచ్‌లపై గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు. వారిపై విశ్వాసం కొనసాగాలి" అని స్పష్టం చేశారు. అలాగే, మంచి పరిస్థితుల్లో కూడా 20 వికెట్లు తీయగల సామర్థ్యం భారత బౌలర్లకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.