Devjit Saikia: బీసీసీఐ నూతన కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా బాధ్యతల స్వీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దేవ్‌జిత్ సైకియా నియమితులయ్యారు.
ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైన నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సైకియా ఎంపికకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు తాత్కాలిక కార్యదర్శిగా పని చేసిన సైకియా, ఈ నియామకంతో అధికారిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
డిసెంబర్ 1, 2024న జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం, కార్యదర్శి స్థాయి ఖాళీ భర్తీ కోసం 30 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే పదవి ఖాళీ అయిన 43వ రోజున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించి, దేవ్‌జిత్ సైకియాను నియమించారు.
Details
దేవ్‌జిత్ సైకియా ఎవరంటే?
దేవ్‌జిత్ సైకియా టీమిండియా మాజీ క్రికెటర్. 1990-1991 మధ్య కాలంలో నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.
తన క్రీడా జీవనకాలంలో 53 పరుగులు చేసి, తొమ్మిది వికెట్లు తీసిన సైకియా, చాలా తక్కువ సమయం క్రికెట్‌కు అంకితం చేశారు.
ఆ తర్వాత క్రికెట్‌ను వీడి, సైకియా న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు.
28వ ఏట గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా చేరి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందారు.
సైకియా క్రికెట్ పరిపాలన రంగంలో 2016లో అడుగుపెట్టారు. అసోం క్రికెట్ అసోసియేషన్లో ఉపాధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
2019లో ACA కార్యదర్శిగా ఎన్నికైన సైకియా 2022లో బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా ప్రమోషన్ పొందారు.