LOADING...
Virender Sehwag: 'ధోనీ తప్పించాడు… సచిన్ నిలబెట్టాడు'.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ధోనీ తప్పించాడు… సచిన్ నిలబెట్టాడు'.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Virender Sehwag: 'ధోనీ తప్పించాడు… సచిన్ నిలబెట్టాడు'.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఓపెనర్‌లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్, తన దూకుడైన ఆటతీరుతో అప్పటి టాప్ బౌలర్లను చిత్తుచేసేవాడు. బ్రెట్ లీ లాంటి వేగవంతమైన బౌలర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టిన ఘనత వీరూది. బౌలర్ ఎవరైనా, ఎంతమంది ఫీల్డర్లు ఉన్నా... ఆఫ్ సైడ్ నుంచి బంతిని బౌండరీకి దూసుకెళ్లించడం అతనికి సాధారణమే. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే అగ్రశ్రేణి బౌలర్లు కూడా ఒత్తిడికి లోనయ్యేవారు. 2011 వన్డే ప్రపంచకప్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ప్రపంచకప్‌కు ముందు వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని అనుకున్నట్టు, దానికి కారణం అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ అని సెహ్వాగ్ తాజాగా వెల్లడించాడు.

Details

రెండు ఫైనల్ మ్యాచుల్లో భారత్ విజయం

2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 82 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన సెహ్వాగ్, అనంతర కాలంలోనూ మంచి ప్రదర్శనలు చేశాడు. కానీ 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో అతని ఫామ్ దెబ్బతింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 16.20 సగటుతో 81 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ సిరీస్‌లో అతని అత్యధిక స్కోరు 33. దీంతో కెప్టెన్ ధోనీ, మిగతా మూడు మ్యాచ్‌లకు అతనిని పక్కన పెట్టాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఆరు నెలల తర్వాత కిట్‌ప్లై కప్‌లో తిరిగి జట్టులోకి వచ్చిన సెహ్వాగ్, మూడు మ్యాచ్‌ల్లో 150 పరుగులు చేసి, అందులో రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

Details

రిటైర్ అవ్వాలని అనుకున్నా

అనంతరం ఫామ్‌ను నిలబెట్టుకుని 2011 ప్రపంచకప్‌లో ఆడాడు. అయితే, ధోనీ తనను తుది జట్టు నుంచి తప్పించడంతో రిటైర్ కావాలని అతను నిర్ణయించుకున్నాడట. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ సలహా కారణంగా ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గాడు. '2008లో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు నేను ఆడాను. ఆ తర్వాత ధోనీ నన్ను జట్టులోంచి తొలగించాడు. కొంతకాలం ఎంపికే కాలేదు. ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లేకుంటే వన్డే క్రికెట్ కొనసాగించడంలో అర్థం లేదనిపించింది. సచిన్ దగ్గరికి వెళ్లి రిటైర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను.

Details

 251 వన్డేల్లో 8273 పరుగులు సెహ్వాగ్

అప్పుడు సచిన్ - 'నేను కూడా 1999-2000లో ఇలాంటిదే ఎదుర్కొన్నాను. ఆ దశ క్రమంగా దాటిపోయింది. నువ్వు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నావు. భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకూడదు. 1-2 సిరీస్‌లు ఆడాక నిర్ణయం తీసుకో' అని చెప్పాడుని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి పరుగులు సాధించిన సెహ్వాగ్, 2011 ప్రపంచకప్‌లో ఆడి, భారత్ విజయంలో భాగమయ్యాడు. మొత్తంగా 251 వన్డేల్లో 8273 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు.