Loading...
Duleep Trophy Final: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జోరు.. మూడో రోజు సౌత్‌ జోన్‌ తడబాటు!
దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జోరు.. మూడో రోజు సౌత్‌ జోన్‌ తడబాటు!

Duleep Trophy Final: దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జోరు.. మూడో రోజు సౌత్‌ జోన్‌ తడబాటు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ వరుసగా రెండో రోజు ఆధిపత్యం కొనసాగించింది. తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఈస్ట్‌ జోన్‌.. మూడో రోజు బంతితోనూ సత్తా చాటింది. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (270; 334 బంతుల్లో) భారీ డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో పాటు ఇతర బ్యాటర్లు కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌ జోన్‌ ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. మంగళవారం మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌ జోన్‌ బ్యాటర్లు ఈస్ట్‌ జోన్‌ బౌలర్ల ధాటికి తడబడుతున్నారు.

వివరాలు

హాఫ్ సెంచరీతో రాణించిన తిలక్ వర్మ

ఒక్క బ్యాటర్‌ కూడా భారీ స్కోరు చేయలేకపోవడంతో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్‌ జోన్‌ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.

సౌత్‌ జోన్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (56*) అర్ధ శతకంతో క్రీజులో ఉండగా.. అతడికి చామ మిలింద్‌ (2*) తోడుగా ఉన్నాడు.

మంచి ఫామ్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్‌ (62; 104 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించినప్పటికీ.. దానిని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు.

మిగతా బ్యాటర్లలో నారాయణ్‌ జగదీశన్‌ 32 పరుగులు చేయగా.. షేక్‌ రషీద్‌ 27, శ్రేయస్‌ గోపాల్‌ 26, స్మరన్‌ రవిచంద్రన్‌ 23 పరుగులు చేశారు.

వివరాలు

708 పరుగులు చేసిన ఈస్ట్ జోన్

సౌత్‌ జోన్‌ ఓపెనర్‌ రికీ భుయ్‌ మాత్రం ఒక్క పరుగు మాత్రమే చేసి సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు.

బౌలింగ్‌లో ఈస్ట్‌ జోన్‌ తరఫున మహ్మద్‌ షమి, ముకేశ్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శిఖర్‌ మోహన్‌, ఎండీ కౌనైన్‌ ఖురేషీకి తలో వికెట్‌ దక్కింది.

ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం సౌత్‌ జోన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌ జోన్‌ చేసిన 708 పరుగుల భారీ స్కోరుకు ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉన్న సౌత్‌ జోన్‌.. నాలుగో రోజు ఆటలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT