Tilak Varma : శస్త్రచికిత్స తర్వాత ఫస్ట్ మ్యాచ్.. రీఎంట్రీతో అదరగొట్టిన తిలక్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ రీఎంట్రీలోనే సత్తా చాటాడు. శస్త్రచికిత్స కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన ఈ యువ ఆటగాడు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించి మళ్లీ బరిలోకి దిగాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌లో భారత్-ఏ తరఫున ఆడి అదరగొట్టాడు. సోమవారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు. 24 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 38 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో తిలక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేయడం భారత జట్టుకు శుభవార్తగా మారింది.
Details
38 పరుగుల తేడాతో భారత్ ఏ జట్టు విజయం
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్-ఏ జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారీగా 238 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో జగదీశన్ (104; 55 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, కెప్టెన్ ఆయుష్ బదోని (60 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ జట్టు 19.4 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. యూఎస్ఏ బ్యాటర్లలో అండ్రీస్ గాస్ (44), సంజయ్ కృష్ణమూర్తి (41) కొంత పోరాటం చేశారు.