సీఎస్కే ఖాతాలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు.. ఏ సంవత్సరం ఎవరిపై నెగ్గిదంటే?
చైన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో అత్యధికంగా 10సార్లు ఫైనల్స్ కు వెళ్లి, 5సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ముంబై కెప్టెన్ రోహిత్ సాధించిన ఐదు ట్రోఫీల రికార్డును చైన్నై కెప్టెన్ ధోనీ సమం చేశారు. ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 5సార్లు టైటిట్ గెలిచిన జట్టుగా చైన్నై రికార్డు సృష్టించింది. చైన్నై సూపర్ కింగ్స్ 2010లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. టైటిల్ వేటలో ముంబై ఇండియన్స్ పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. చైన్నై 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులే చేయగలిగింది.
ఐపీఎల్ లో సత్తా చాటిన చైన్నై సూపర్ కింగ్స్
చైన్నై వరుసగా 2011లో మరోసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్‌లో ఆర్సీబీని 58 పరుగుల తేడాతో ఓడించి సీఎస్కే రెండోసారి ట్రోఫీని ఎగరేసుకొనిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చైన్నై 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఆర్సీబీ 147 పరుగులకే పరిమితమైంది. 2018లో మరోసారి ఐపీఎల్ ఫైనల్లో చైన్నై అడుగుపెట్టింది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 178 పరుగులు చేయగా.. చైన్నై 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఘన విజయం సాదించింది. ఇక 2021లో కేకేఆర్ ను 27 పరుగుల తేడాతో చైన్నై చిత్తు చేసింది. దీంతో ఐపీఎల్లో నాలుగో టైటిల్ ను కైవసం చేసుకుంది.