Jacob martin: భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌కు భారీ ఊరట.. 22 ఏళ్ల తర్వాత క్లీన్‌చిట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్, వడోదరకు చెందిన జాకబ్ మార్టిన్‌కు 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. మార్టిన్‌పై ఆరోపణలను నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం.. ఆయన్ను అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. 2004లో ఓ క్రికెట్ జట్టు యూకే పర్యటనకు వెళ్లింది. ఆ జట్టులోని ఓ ఆటగాడు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. అనంతరం నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్‌తో భారత్‌కు తిరిగి వస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.
వివరాలు
దర్యాప్తు సంస్థ విఫలం..
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చీటింగ్ కింద సెక్షన్ 420, ఫోర్జరీకి సంబంధించి సెక్షన్ 468, నకిలీ పత్రాలను ఉపయోగించినందుకు సెక్షన్ 471, నేరపూరిత కుట్ర కింద సెక్షన్ 120బీతో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో జాకబ్ మార్టిన్ పేరును కూడా చేర్చారు. అయితే కేసు విచారణ సందర్భంగా మార్టిన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి విశ్వసనీయమైన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయింది.
నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వ్యవహారంలో, ప్రయాణ ఏర్పాట్లలో, ఆర్థిక లావాదేవీల్లో మార్టిన్ పాత్ర ఉందని నిరూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైంది.
వివరాలు
స్పోర్ట్స్ క్లబ్‌పై మార్టిన్‌కు నియంత్రణ ఉందనే ఆరోపణ..
అలాగే అజ్వా స్పోర్ట్స్ క్లబ్‌పై మార్టిన్‌కు నియంత్రణ ఉందనే ఆరోపణకు కూడా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
సాక్షులు సైతం ఆయనపై చేసిన ఆరోపణలను ధ్రువీకరించకపోవడంతో మార్టిన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
కోర్టు తీర్పు అనంతరం జాకబ్ మార్టిన్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు.
2004లో తన జట్టు యూకే పర్యటనకు వెళ్లిందని, ఒక్క ఆటగాడు మినహా మిగిలిన వారంతా తిరిగి వచ్చారని తెలిపాడు.
వీసా గడువు దాటిన తర్వాత కూడా ఆ ఆటగాడు యూకేలోనే ఉండిపోయాడని, నకిలీ స్టాంపింగ్‌తో తిరిగి వస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడని చెప్పాడు.
వివరాలు
కేసు కారణంగా తీవ్ర ఒత్తిడి..
అసలు ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని.. తాను అంతర్జాతీయ క్రికెటర్ కావడంతో పాటు తన పేరు ప్రముఖంగా ఉండటంతో విచారణ సమయంలో తనను ఈ కేసులో ఇరికించారని మార్టిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
22 ఏళ్లుగా ఈ కేసు కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని మార్టిన్ తెలిపాడు.
ఈ వ్యవహారం కారణంగా తన రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోయానని, బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదని చెప్పాడు.
ఇప్పుడు కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్ తనకు ఎంతో ఊరటనిచ్చిందని, తన జీవితంలో ఇదొక పెద్ద మలుపు అని పేర్కొన్నాడు.
కుడిచేతి వాటం బ్యాటర్ అయిన జాకబ్ మార్టిన్ భారత్ తరఫున 10 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈమ్యాచ్‌ల్లో మొత్తం 158 పరుగులు చేశాడు.