US Open Grand Slam: ఓటమి అంచుల నుంచి.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన కోకో గాఫ్!
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా యువ తార, 2023 చాంపియన్ కోకో గాఫ్ రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా)తో జరిగిన మహిళల సింగిల్స్ చివరి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ కోకో గాఫ్ 2-6, 7-6 (9/7), 6-2తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ 2 గంటల 19 నిమిషాలపాటు సాగింది.
వివరాలు
టైబ్రేక్‌లో ఉత్కంఠ..
రెండో సెట్ టైబ్రేక్‌లో కోకో గాఫ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక దశలో 5-6తో, మరోసారి 6-7తో వెనుకబడిన గాఫ్ ఓటమి ప్రమాదంలో పడింది.
అయితే రెండు సందర్భాల్లోనూ కోకో పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది.
నిర్ణాయక మూడో సెట్‌లో మాత్రం కోకో గాఫ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆండ్రీవాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధిస్తూ 6-2తో సెట్‌ను సొంతం చేసుకుంది.
తద్వారా మ్యాచ్‌ను గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో పెగూలా (అమెరికా)తో సబలెంకా (బెలారూస్), రిబాకినా (కజకిస్తాన్)తో కోకో గాఫ్ తలపడతారు.
వివరాలు
సెమీస్‌లో జ్వెరెవ్, ఖచనోవ్
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), అన్‌సీడెడ్ ఖచనోవ్ (రష్యా) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6-2, 7-5, 6-1తో ఘన విజయం సాధించాడు.
మూడు సెట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన జ్వెరెవ్ సునాయాసంగా సెమీస్ బెర్త్ దక్కించుకున్నాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 6-2, 7-5, 3-2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అతని ప్రత్యర్థి అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం) గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దీంతో ఖచనోవ్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు.