Sunil Gavaskar : ఎంసీసీ నిబంధనల మార్పుపై గావస్కర్ అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో అనుభవజ్ఞులు తక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య కటక్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఈ విషయంపై వ్యాఖ్యానించాడు. ఎంసీసీ కొన్ని సందర్భాల్లో నిబంధనలను ఎందుకు మారుస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు.
క్రికెట్ చట్టాలను ఎంసీసీ మారుస్తుందని, ఇది ఒక ప్రైవేట్ క్లబ్ అని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించిన నిబంధనలను రూపొందించే బాధ్యత దానిదే అని అన్నారు.
కానీ అక్కడ తప్పకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవజ్ఞులు ఉండాలని, ముఖ్యంగా మాజీ కెప్టెన్లు, కోచ్‌లు అవసరమన్నారు.
Details
రాహుల్ ద్రావిడ్ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి
గ్రేమ్ స్మిత్, రాహుల్ ద్రావిడ్ వంటి అనుభవం కలిగినవారు కమిటీలో భాగం కావాలన్నారు. ప్రస్తుతం రికీ పాంటింగ్ ఉన్నారని, ఈ స్థాయిలో మరికొందరు ఉండాలని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యనించారు.
ప్రస్తుత కమిటీలో అంతర్జాతీయ అనుభవం ఉన్నవారు ఉన్నారని తాను భావించడం లేదన్నారు.
ఏ నిబంధన మార్చాలన్నా దానికి కారణం ఉండాలని, గతంలో రెండు బౌన్సర్ల నిబంధన, రోజుకు 90 ఓవర్ల నిబంధన ఇలా ఏ మార్పుకైనా ఒక పద్ధతి ఉండేదన్నారు.
అయితే నాన్-స్ట్రైకర్ క్యాచ్ సమయంలో తర్వాతి బంతిని ఎదుర్కోకూడదనే నిబంధన మార్పు వెనుక ఏ కారణం ఉందో అర్థం కావడం లేదని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
Details
ఈ ఏడాది ఆ నిబంధన తొలగింపు
2022 మార్చి వరకు, బ్యాటర్ బంతిని గాల్లోకి లేపినప్పుడు క్యాచ్ అందుకునే లోగా నాన్-స్ట్రైకర్ సగం పిచ్ దాటితే, అతడే తర్వాతి బంతిని ఎదుర్కొనేవాడని, కానీ ఆ ఏడాది ఈ నిబంధనను తొలగించారన్నారు.
దీంతో ఔటైన బ్యాటర్ స్థానంలో వచ్చిన క్రికెటర్ కొత్తగా క్రీజులోకి వచ్చి తర్వాతి బంతిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గావస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
నిన్నటి మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే శ్రేయస్ ముందుకొచ్చినా, తర్వాతి బంతిని అక్షరే ఎదుర్కొన్నారని, ఈ సందర్భంలో గావస్కర్ ఈ నిబంధన మార్పుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ శతకం (119 పరుగులు) చేసి జట్టును విజయపథంలో నడిపించాడు.