ENG vs PAK: 'సెహ్వాగ్ కంటే గొప్పనా?'.. సైమ్ ఆయూబ్‌ను ఆడించడంపై నాజర్ హుస్సేన్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ విమర్శలకు దారితీస్తోంది. పర్యటన మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపిన పాక్ జట్టు.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడని సైమ్ ఆయూబ్‌ను ఏకంగా తుది జట్టులోకి తీసుకుంది. అయితే బరిలోకి దిగిన అతడు ఘోరమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో సైమ్ ఆయూబ్‌తో పాటు పాక్ మేనేజ్‌మెంట్ తీరుపైనా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను (Virender Sehwag) ఉదాహరణగా పేర్కొనడం గమనార్హం.
వివరాలు
'అతడిని ఎలా ఎదుర్కొంటాడని భావించారు?'
'సైమ్ ఆయూబ్ (Saim Ayub) చివరిసారిగా 2025 అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడిందే లేదు.
సీపీఎల్ టీ20 క్రికెట్ బరిలో ఉన్న అతడు.. అక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టాడు. విదేశీ పిచ్‌లపై కనీసం అవగాహన లేని కుర్రాడిని ఇలా పంపించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు.
రాబిన్‌సన్‌తో కూడిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎటాక్‌ను అతడు ఎలా ఎదుర్కొంటాడని భావించారో కూడా అర్థం కావడం లేదు.
ఇలాంటి నిర్ణయాలతో టెస్టు క్రికెట్‌ను అగౌరవపరిచినట్లే. మీరు ఏ క్రికెటర్‌నైనా అడగండి.. టెస్టు ఫార్మాట్ చాలా క్లిష్టమైందనే చెబుతారు. ఇక ఇంగ్లిష్ గడ్డపై టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడమంటే అత్యంత కఠినమైన విషయం.
వివరాలు
2011లో సెహ్వాగ్ విషయంలోనూ ఇదే జరిగింది..
కానీ, మీరు మాత్రం ఎక్కడో ఉన్న ఓ ప్లేయర్‌ను తీసుకొచ్చి 'గుడ్ లక్' అని చెప్పి ఇక్కడ వదిలేశారు. చివరకు ఆ కుర్రాడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే పరిమితమయ్యాడని నాజర్ హుస్సేన్ విమర్శించాడు.
భారత్ 2011లో ఇంగ్లండ్ పర్యటనకు (India Tour England) వెళ్లింది. ఆ సిరీస్ మధ్యలోనే స్వదేశంలో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్‌ను టీమ్‌ఇండియా పిలిపించింది.
మూడో టెస్టులో అతడిని నేరుగా ఓపెనర్‌గా బరిలోకి దింపింది. అయితే, సెహ్వాగ్ కూడా ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
వివరాలు
సెహ్వాగ్ ను కూడా అప్పట్లో భారత్ తొలగించింది
ఇప్పుడు ఈ విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటూ నాజర్ హుస్సేన్ సైమ్ ఆయూబ్‌పై విమర్శలు చేశాడు.
ఇదే ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో సెహ్వాగ్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులేమీ చేయలేదు. అతడిని కూడా భారత్ నుంచి అర్ధంతరంగా తెప్పించారు.
ఎంతో అనుభవం కలిగిన సెహ్వాగ్ కూడా ఈ పిచ్‌పై ఇబ్బంది పడ్డాడు. అతడి కంటే ఆయూబ్ ఏమైనా గొప్పవాడా?'' అని హుస్సేన్ వ్యాఖ్యానించాడు.