
IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతోంది.
శనివారం ఇద్దరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం ఏర్పడడంతో యుద్ధ పరిస్థితులకు తెరపడింది. దీంతో ఐపీఎల్ టోర్నీ తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది.
భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 లేదా 16న మ్యాచ్‌లు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కాగా, టోర్నీ ఫైనల్‌ను మే 30న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. షెడ్యూల్ మాత్రం ఈ రోజు రాత్రి విడుదలయ్యే అవకాశం ఉంది.
Details
డబుల్ హెడర్ లాగా నిర్వహించేలా ప్లాన్
ఇక మే 13 లోగా పంజాబ్ కింగ్స్ మినహా మిగిలిన తొమ్మిది జట్ల ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్‌లలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని బీసీసీఐ ఫ్రాంఛైజీలకు సూచించింది.
విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను వెంటనే తెలియజేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బీసీసీఐ తాజా యోచనల ప్రకారం, లీగ్ దశలో మిగిలిన 12 మ్యాచ్‌లను డబుల్ హెడర్‌లుగా నిర్వహించాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్‌కు తటస్థ వేదిక ఖరారు చేయాల్సిన అవసరం ఇంకా ఉంది.
Details
సంతోషం వ్యక్తం చేస్తున్న ఐపీఎల్ అభిమానులు
ఈ నేపథ్యంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలున్నాయి.
ఐపీఎల్ 2025లో ఇంకా 12 లీగ్ మ్యాచులు, రెండు క్వాలిఫయర్‌లు, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మే 25న కోల్‌కతాలో జరగాల్సి ఉంది.
టోర్నీ నిలిచే సమయానికి పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (16), బెంగళూరు ఛాలెంజర్స్ (16), పంజాబ్ కింగ్స్ (15), ముంబై ఇండియన్స్ (14) టాప్-4 స్థానాల్లో ఉన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అభిమానులు ఐపీఎల్ మళ్లీ మొదలవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.