BANW vs INDW: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్.. టీమిండియా విజయం
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా మహిళలు మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన బంగ్లా 120 పరుగులకే అలౌటైంది. దీంతో టీమిండియా 108 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ (52), జెమిమా రోడ్రిగ్స్ 86 రన్స్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా వన్డేల్లో హర్మన్ ప్రీత్ కౌర్ 18 అర్ధసెంచరీలు సాధించగా.. ఇందులో రెండు హాఫ్ సెంచరీలను బంగ్లాలోనే సాధించింది.
హర్మన్ ప్రీత్ కౌర్ వన్డేల్లో సాధించిన రికార్డులివే
హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో వన్డేల్లో అరంగ్రేటం చేసింది. ఇప్పటివరకూ 126 వన్డేల్లో 37.96 సగటుతో 3,379 పరుగులు చేసింది. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తంగా ఉమెన్స్ వన్డేల్లో భారత్ తరుపును అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. టీమిండియా మాజీ క్రీడాకారిణి మిథిలీ రాజ్ 7,805 పరుగులతో అగ్రస్థానంలో నిలిచింది. స్వదేశంలో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడిన 48 వన్డేల్లో 36.65 సగటుతో 1,283 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా భారత మహిళ జట్టు 1-1తో సమం చేసింది. ఇక టీమిండియా, బంగ్లా మధ్య చివరి వన్డే జులై 22న ప్రారంభం కానుంది.