
Sonny Baker: అరంగేట్రానికి ముందే హ్యాట్రిక్.. ఇంగ్లండ్ యువ పేసర్ సంచలన రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ క్రికెట్ యువ పేసర్ సొన్ని బేకర్ (Sonny Baker) అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన ఈ స్పీడ్‌స్టర్, స్వదేశంలో జరుగుతున్న 'ది హండ్రెడ్ లీగ్'లో తన బౌలింగ్ ప్రతిభను చాటాడు. మాంచెస్టర్ ఒరిజినల్స్ (Manchester Originals) తరఫున ఆడుతున్న బేకర్, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన హ్యాట్రిక్ (Hattrick) నమోదు చేసి జట్టుకు మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అందించాడు. దీంతో మాంచెస్టర్ జట్టుకు హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో రెచ్చిపోయిన బేకర్, ఇప్పటికే విజయం దిశగా పయనిస్తున్న సూపర్ ఛార్జర్స్ బ్యాటర్లను ఒక్కసారిగా కుదిపేశాడు.
Details
57 పరుగుల తేడాతో ఘన విజయం
172 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నిస్తున్న సూపర్ ఛార్జర్స్‌ను 114 పరుగుల వద్దే ఆపేశాడు. మొదట డేవిడ్ మలాన్‌ను క్లిన్ బౌల్డ్ చేసిన బేకర్, 86వ బంతికి టామ్ లావెస్, 87వ బంతికి జాకబ్ డఫ్ఫీలను పెవిలియన్‌కి పంపి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఫలితంగా మాంచెస్టర్ ఒరిజినల్స్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బేకర్ ఈ ఘనతతో 'ది హండ్రెడ్ లీగ్'లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు.
Details
వన్డే జట్టులోకి ఎంపిక
అతడి కంటే ముందు ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir - 2021లో బర్మింగ్‌హమ్ పీనిక్స్ తరఫున), టైమల్ మిల్స్ (2023లో సదర్న్ బ్రేవ్ తరఫున), సామ్ కరన్ (Sam Curran - ఓవల్ ఇన్విసిబుల్స్ జట్టుతో)లు ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక రాబోయే నెలలో దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ పర్యటన చేయనుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న బేకర్‌ను సెలెక్టర్లు వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. దీంతో, తన తొలి వన్డేలో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి అతడు సిద్ధమవుతున్నాడు.