T20 World Cup 2026: హ్యాట్రిక్ అంటే ఆస్ట్రేలియానే గుర్తొస్తోంది.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు నిరాశే
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, ఊహించని మలుపులతో నిండిన మ్యాచ్‌లు గుర్తొస్తాయి. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే ఈ పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లకు హ్యాట్రిక్ సాధించడం అత్యంత కఠినమైన పని. అలాంటిది కొద్దిమంది బౌలర్లు మాత్రమే టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన వరల్డ్‌కప్‌లలో నమోదైన హ్యాట్రిక్స్‌పై ఓసారి లుక్కేద్దాం. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ సాధించిన ఘనత ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి దక్కింది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై వరుసగా మూడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అప్పట్లో ఈ ఘనత, టీ20 క్రికెట్‌లో కూడా బౌలర్లకు ఎంత ప్రాధాన్యం ఉందో చాటిచెప్పింది.
Details
2021లో వరుస హ్యాట్రిక్స్ నమోదు
బ్రెట్ లీ బౌలింగ్ చేస్తున్నాడంటే స్టార్ బ్యాట్స్‌మెన్లు కూడా రక్షణాత్మకంగా ఆడాల్సిన పరిస్థితి ఉండేది. 2007 తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు మరో హ్యాట్రిక్ నమోదు కాలేదు. అయితే 2021 టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్స్ వరుసగా నమోదయ్యాయి. ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్ నెదర్లాండ్స్‌పై హ్యాట్రిక్ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అదే టోర్నీలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ సాధించగా, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ తీసి అదరగొట్టాడు.
Details
ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత
2022 టీ20 వరల్డ్‌కప్‌లో అసోసియేట్ దేశాల బౌలర్లు కూడా తమ సత్తా చాటారు. యూఏఈ తరఫున కార్తిక్ మేయప్పన్ శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించగా, ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ న్యూజిలాండ్‌పై ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ప్రదర్శనలు చిన్న జట్ల ప్రతిభను ప్రపంచానికి తెలియజేశాయి. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అసాధారణ ప్రదర్శనతో టోర్నీకి హైలైట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌పై ఒక హ్యాట్రిక్, ఆఫ్ఘనిస్తాన్‌పై మరో హ్యాట్రిక్ సాధించి ఒకే వరల్డ్‌కప్‌లో రెండు హ్యాట్రిక్స్ తీసిన అరుదైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అదే టోర్నీలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్ అమెరికాపై హ్యాట్రిక్ పడగొట్టి జాబితాలోకి మరో కొత్త పేరు చేర్చాడు.
Details
భారత్ నుంచి ఏ బౌలర్ సాధించలేదు
ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో నమోదైన ఈ హ్యాట్రిక్స్ బౌలింగ్ ఎంత కీలకమో మరోసారి రుజువు చేశాయి. అయితే భారత్ తరఫున ఇప్పటివరకు ఒక్క బౌలర్ కూడా టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ సాధించలేదు. 2026 వరల్డ్‌కప్‌లో అయినా ఆ ఘనత సాధ్యమవుతుందా అనే ఆసక్తి నెలకొంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 2026 టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈసారి పొట్టి టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అభిమానులు హ్యాట్రిక్‌లతో కూడిన మరిన్ని ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.