World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ ఎవరో చెప్పేసిన జో రూట్
త్వరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 సమరం మొదలు కానుంది. ఇప్పటికీ చాలా జట్లు ఈ మెగా టోర్నీ కోసం జట్లను కూడా ప్రకటించేశాయి. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాల గురించి, కీలకంగా మారే ఆటగాళ్లపై చర్చ సాగుతోంది. ఈ టోర్నీలో ఏ ఆటగాడు అత్యధిక పరుగులు ఎవరు చేస్తారో ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఈ వ్యవహారంపై స్పందించాడు. టాప్ స్కోరర్ గా నిలిచే ఆటగాడు ఎవరో తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జో రూట్ తెలియజేశాడు.
అదిల్ రషీద్ అత్యధిక వికెట్లు తీయగలడు
వన్డేలు, టీ20లకు ఆడేటప్పుడు బెయిర్ స్టో ఆటతీరు పూర్తిగా మారిపోతుందని, టాపార్డర్‌లో అతడే కీలకంగా వ్యవహరిస్తాడని, వైట్ బాల్ క్రికెట్‌లో బెయిర్ స్టో ఆటతీరును అమోఘమని జో రూట్ ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు అత్యధిక వికెట్లు తీసే బౌలర్ ఎవరన్న ప్రశ్నకు కూడా జో రూట్ సమాధానం ఇచ్చాడు. భారత్‌లోని స్పిన్ పిచ్ లపై అదిల్ రషీద్ అత్యధిక వికెట్లు తీయగలడు అని జో రూట్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక టోర్నీ ఆరంభపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది.