India vs Pakistan: కొలంబోలో హై వోల్టేజ్ మ్యాచ్.. ఐదు ఆసక్తికర పోరాటాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్‌లో అత్యంత హై వోల్టేజ్ పోరుగా భావిస్తున్న భారత్-పాక్ సమరం కొలంబో వేదికగా ఆరంభం కానుంది. టోర్నీ మొత్తంలోనే అత్యధిక ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులు ప్రతి చిన్న అంశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా గత లెక్కలు సరిచేసుకోవాలనే తపనతో కఠినంగా సాధన చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టు ఇప్పటికే కొలంబోలో ఉండటంతో మైదాన పరిస్థితులకు అలవాటు పడింది. టీమిండియాకు మాత్రం ప్రాక్టీస్‌కు ఒక్కరోజే సమయం దొరికినా, ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా చెమటోడ్చారు. ఈ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే ఐదు కీలక పోరాటాలపై ఇప్పటికే చర్చ జోరుగా సాగుతోంది.
Details
హార్దిక్ పాండ్యా vs ఉస్మాన్ తారిఖ్
హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 7-16 ఓవర్ల మధ్య బౌలింగ్‌కు వచ్చే అవకాశం ఉన్న ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొనడం సవాలుగా మారుతుంది. తారిఖ్ క్రీజ్‌పై తీసుకునే విరామం (పాజ్) బ్యాటర్ టైమింగ్‌ను దెబ్బతీయొచ్చు. అయితే బ్యాక్‌లిఫ్ట్, బ్యాలెన్స్ ఆధారంగా వేగంగా బ్యాట్ స్వింగ్ చేసే పాండ్యా తన ప్రత్యేకతైన 'బంతి రిలీజ్ అయిన తర్వాత కదలడం' శైలితో అతనిపై పైచేయి సాధించే అవకాశముంది.
Details
బాబర్ ఆజమ్ vs కుల్దీప్ యాదవ్
పొట్టి ఫార్మాట్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఇప్పటివరకు బాబర్ ఆజమ్ ఎదుర్కోలేదు. కానీ వన్డేల్లో మాత్రం మూడు సార్లు తలపడగా, రెండు సార్లు కుల్దీప్‌కే వికెట్ ఇచ్చాడు. మొత్తం 52 బంతుల్లో బాబర్ కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఆసియా కప్ టీ20ల్లో కుల్దీప్ పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టి, ఫైనల్లో నాలుగు వికెట్లతో విశ్వరూపం చూపించాడు. ఆ టోర్నీలో బాబర్ ఆడలేదు. ఈసారి కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున కుల్దీప్‌ను తుదిజట్టులో చేర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Details
జస్ప్రీత్ బుమ్రా vs షహిద్‌జాద ఫర్హాన్
గత దాయాదుల పోరులో జస్ప్రీత్ బుమ్రా, షహిద్‌జాద ఫర్హాన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతర్జాతీయ స్థాయిలో బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌లు బాదిన అరుదైన బ్యాటర్లలో అతడు ఒకడిగా నిలిచాడు. తర్వాత ఓ డాక్యుమెంటరీలో ఆ షాట్ల గురించి ఫర్హాన్ వివరించాడు కూడా. మూడు మ్యాచ్‌ల్లో బుమ్రా వేసిన 34 బంతుల్లో 54 పరుగులు సాధించడం విశేషం. నమీబియాపై పవర్‌ప్లేలో బుమ్రాను ఉపయోగించని భారత్, ఈసారి పాక్‌పై అతడిని ఎలా వినియోగిస్తుందో ఆసక్తిగా మారింది.
Details
ఇషాన్ కిషన్ vs షహీన్ షా అఫ్రిదీ
వీడియో గేమ్ తరహా ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్‌కు పెద్ద పరీక్ష ఎదురు చూస్తోంది. పాకిస్థాన్ పేస్ ఆయుధం షహీన్ షా అఫ్రిదీ ఎడమచేతి బ్యాటర్లకు దూరంగా వెళ్లేలా యాంగిల్ సృష్టించడంలో నిపుణుడు. అంతేకాదు ఇషాన్‌పై తన షార్ట్ బాల్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం కూడా ఉంది. ఈ పోరాటం మ్యాచ్‌లో కీలకంగా మారొచ్చు.
Details
శివమ్ దూబే vs అబ్రార్ అహ్మద్
స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్‌గా శివమ్ దూబే పేరు గడించాడు. మణికట్టు స్పిన్‌ను కూడా ధైర్యంగా ఆడగలడు. 2025 సీజన్‌లో స్పిన్ బంతులను 193 స్ట్రైక్‌రేట్‌తో ఎదుర్కొని పరుగులు సాధించడం అతని సామర్థ్యాన్ని చూపిస్తుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో సోధీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పినర్లు అబ్రార్ అహ్మద్, షబాబ్ ఖాన్‌లకు దూబే గట్టి పరీక్షగా నిలవొచ్చు. మొత్తంగా చూస్తే, ఈ ఐదు కీలక వ్యక్తిగత పోరాటాలే మ్యాచ్ గమనాన్ని మలిచే అవకాశముంది. కొలంబో వేదికగా దాయాదుల సమరం మరింత ఉత్కంఠ రేపనుంది.