Deepti Sharma: స్మృతి మంధానకు అండగా ఉంటా.. వైస్ కెప్టెన్సీపై దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా తనకు అప్పగించిన కొత్త బాధ్యతలను సవాల్‌గా స్వీకరిస్తానని ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తెలిపింది. జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు సాధ్యమైనంత సహకారం అందిస్తూ, జట్టుకు మరిన్ని విజయాలు అందించడమే తన లక్ష్యమని పేర్కొంది. జింబాబ్వేతో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. కొత్త బాధ్యతలు, జట్టు ప్రణాళికలపై స్పందించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్మృతి మంధానకు భారత మహిళల వన్డే, టీ20 జట్ల పగ్గాలను అప్పగించారు. జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్‌కు దీప్తి శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. తనకు లభించిన కొత్త బాధ్యతలపై దీప్తి సంతోషం వ్యక్తం చేసింది.
వివరాలు
వడోదరా పిచ్‌పై దీప్తి శర్మ ఏమన్నదంటే?
"కొత్త బాధ్యతలు వచ్చినప్పుడు వాటిని సవాల్‌గా స్వీకరిస్తా. జట్టులోని ఇతర ఆటగాళ్లకు వీలైనంత సహాయం చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది.
ఆటగాడిగా ఉన్నా, వైస్ కెప్టెన్‌గా ఉన్నా ఎక్కువ మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించడమే నా లక్ష్యం" అని దీప్తి శర్మ పేర్కొంది.
జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్‌లో వడోదరా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని దీప్తి శర్మ అభిప్రాయపడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే 300కు పైగా పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
తుది జట్టు కూర్పును మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపు ముందే నిర్ణయిస్తామని వెల్లడించింది. జట్టులో అనవసరమైన మార్పులు చేయకుండా, ఇప్పటివరకు బాగా ఆడిన విధానాన్నే కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.